మన్సూరాబాద్, నవంబర్ 5: గుర్తు తెలియని దుండగులు మన్సూరాబాద్ చౌరస్తా సమీపంలోని హనుమాన్ దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రాంగణంలోని హుండీని పగులగొట్టి నగదును అపహరించుకుపోయారు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలయ కమిటీ సభ్యుల కథనం ప్రకారం.. మన్సూరాబాద్ చౌరస్తా సమీపంలోని హనుమాన్ దేవాలయాన్ని రోజు మాదిరిగా మంగళవారం రాత్రి పూజల అనంతరం మూసి వేశారు. బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆలయానికి విచ్చేసిన పూజారి గుడి ద్వారం తెరిచి ఉండటాన్ని గమనించాడు.
గుడిలోకి వెళ్లి చూడగా హుండీ పగులగొట్టి ఉంది. వెంటనే విషయాన్ని స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు తెలియపరచగా వారు అక్కడి చేరుకుని హుండీని పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుండీలోని సుమారు రూ. 10 వేల నగదు చోరీకి గురయినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.