Hyderabad | సిటీబ్యూరో, మార్చి18(నమస్తే తెలంగాణ): ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్-8లోని సినీహీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మూడో అంతస్తులోని విశ్వక్సేన్ సోదరి రూమ్‌లోని బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. కేవలం 20నిమిషాల్లో ఈ దొంగతనం చేశాడని పోలీసులు చెబుతున్నారు. షేక్‌పేటలోని డైమండ్హిల్స్లో తాళం వేసిన ఇంట్లో 34 తులాల బంగారం, రూ.4.5లక్షలు, 550 కెనెడియన్ డాలర్లు దుండగులు ఎత్తుకెళ్లారు. చోరీకి పాల్పడటమే కాకుండా సీసీ కెమెరాల్లో తమ వీడియోస్ కనిపించకుండా సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌తో సహా ఎత్తుకెళ్లిపోయారు.
కేవలం వారంరోజుల్లో జరిగిన ఘటనలు..
మూడునాలుగు రోజుల్లోనే వీఐపీలు ఉండే కాలనీలో దొంగలు యథేచ్ఛగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఓ వైపు అదే ఏరియాలో అదే జోన్లో దొంగతనాలు, రెక్కీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
హైదరాబాద్‌లో దొంగల స్వైరవిహారం..
నగరంలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలు జనాలకు దడ పుట్టిస్తున్నాయి. చోరీలకు చెక్‌పెట్టాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. దీంతో నేరగాళ్లు అదును చిక్కితే చాలు దొంగతనాలు, దోపిడీలు చేస్తూ భారీగా సొమ్ములు దోచుకుంటున్నారు. కొత్తగా ధనవంతులు, వీఐపీల ఇండ్లే టార్గెట్‌గా ఆగంతకులు చోరీకి ప్లాన్ చేస్తున్నారు. కొన్నిచోట్ల చోరీలు జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల రెక్కీ నిర్వహించి అనుకూల సమయాల్లో కొట్టేసే ప్లాన్‌లో ఉంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దాదాపుగా పాత నేరస్తులే ఈ చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.గతం మాదిరిగా సాధారణ దొంగతనాలు కాకుండా ఒక్క దెబ్బతో సెటిలయిపోవాలన్న లక్ష్యంతో వీరు చోరీలకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే దొంగతనాలకు పాల్పడిన వారిని సాంకేతికత సాయంతో పట్టుకుంటున్నా సొమ్ము రికవరీ చేయడంలో మాత్రం పోలీసులకు కష్టమవుతున్నది. దొంగతనాలకు పాల్పడే వారు పక్కాప్లాన్‌తో తాము చోరీ చేయగానే పక్క రాష్ర్టాలకు సొమ్ములు చేరవేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి తాము దొంగతనం చేసిన చోట సీసీ కెమెరాల్లో తమ రూపురేఖలు కనిపించకుండా జాగ్రత్త పడటం, అవసరమైతే కెమెరాలు ధ్వంసం చేయడమో చేస్తున్నారు.
సగటున రోజుకు 4 దొంగతనాలు!
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 71 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 15 వేల మంది పోలీసులు, ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. సిటీలో ఉంటున్నవారి రక్షణతో పాటు దొంగతనాలు, దోపిడీలు జరగకుండా చూడటానికి 5లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆయా పోలీస్స్టేషన్లతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్కంట్రోల్లో 24 గంటల పాటు విధుల్లో ఉండేవారు నిరంతరం ఈ సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తుంటారు. అయినా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. కొందరు పగటిపూటే ఇళ్లలోకి చొరబడి విలువైన బంగారం, వెండి నగలతోపాటు నగదు దొంగిలిస్తుండగా.. మరికొందరు రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంళ్లను సెలక్ట్ చేసుకుని రెక్కీ నిర్వహిస్తున్నారు. కాస్ట్ లీ ఏరియాలు, ధనవంతులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సగటున రోజుకు నాలుగు దొంగతనాలు జరుగుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. గతంతో పోలిస్తే సంవత్సర కాలంగా నేరాల సంఖ్య సగానికి పైగా పెరిగింది. ఒక్క దొంగతనాలే వందకు వంద శాతం పెరగడం పోలీసులకు దొంగలు కొత్త సవాల్ విసురుతున్నారు.
ఎండాకాలానికి ముందే.. !
సమ్మర్ రాగానే పోలీసులు నగర ప్రజలకు సూచనలు చేస్తారు. ఇండ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు తమకు చెప్పమని.. కానీ ఇంకా సమ్మర్ హాలిడేస్ రానేలేదు.. నగరవాసులు ఇండ్లకు తాళాలు వేసి వెళ్లే పరిస్థితి రాకముందే నగరంలో దొంగతనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దీనికి నిఘా వైఫల్యమే కారణమని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నేరస్తుల కదలికలను పసిగట్టే నిఘా విభాగం దొంగతనాలు జరుగుతున్నా.. అందులోనూ పాత నేరస్తులే ఎక్కువగా ఉంటున్నా కనిపెట్టలేకపోతున్నారంటే ఎంత నిర్లక్ష్యం ఉందో ఉన్నతాధికారులు పరిశీలించి పరిస్థితిని సమీక్షించాలని వారు కోరుతున్నారు. ప్రధానంగా భద్రత ఎక్కువగా ఉండే ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో చోరీలు, రెక్కీలు జరుగుతున్నాయి. ప్రధానంగా నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డ్ చేసే ప్రతీ అంశాన్ని సంబంధిత పోలీస్స్టేషన్లలో పర్యవేక్షిస్తుంటారు. అయితే ఈ పని చేస్తున్న సిబ్బందిలో అధికశాతం మంది విధుల నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కమిషనరేట్‌లో ఉన్న స్టేషన్ల పరిధిలో గస్తీ పెంచుతామని, పాత నేరస్తుల కదలికలపై కూడా దృష్టి పెడుతామని పోలీసులు చెబుతున్నారు.
డీకే అరుణ ఇంట్లో చోరీకి యత్నం.. ఢిల్లీకి చెందిన పాత నేరస్తుడి అరెస్టు
బంజారాహిల్స్, మార్చి 18: బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలో చోరీకి యత్నించిన ఓ నేరస్తుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల కిందట జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56 లోని ఎంపీ డీకే అరుణ నివాసంలోకి వెనుక డోర్ నుంచి ఓ ఆగంతకుడు ప్రవేశించి సుమారు గంటన్నర పాటు సంచరించిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించారు. కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఉత్తరాఖండ్ రాష్ర్టానికి చెందిన మహ్మద్ అక్రమ్(28) అనే వ్యక్తి గత కొన్నేండ్లుగా ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. అక్కడే టైల్స్ షాపులో పనిచేసే అక్రమ్ చోరీలకు పాల్పడుతున్నాడు. అతడిపై ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సుమారు 30కి పైగా చోరీ కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
ఈ క్రమంలో కొత్త ప్రాంతాల్లో చోరీలు చేయాలని నిర్ణయించుకున్న అక్రమ్ 15 రోజుల కిందట నగరానికి వచ్చాడు. పాతబస్తీ భవానినగర్ లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. హైదరాబాద్ లోని సంపన్నులు నివాసముంటున్న ప్రాంతం ఏదంటూ గూగుల్ లో సెర్ చేయగా.. జూబ్లీహిల్స్ అని తెలిసింది. దీంతో జూబ్లీహిల్స్ లోని ఏదైనా ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్న అక్రమ్ గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించాడు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56 లోని డీకే అరుణ ఇంటి వెనుకాల సరైన నిఘా లేకపోవడం, అక్కడి నుంచి లోనికి వెళ్లేందుకు అవకాశం కనిపించడంతో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ముఖానికి మాస్క్ వేసుకొని ఎంపీ డీ.కె.అరుణ ఇంటి వెనుకాల గోడదూకి లోనికి ప్రవేశించిన అక్రమ్ ఇంట్లో సీసీ కెమెరాల వైర్ కట్ చేసి చోరీకి యత్నించాడు. ఇంట్లోని వస్తువులు చిందరవందర చేశాడు. అయితే అక్కడ నగదు లభ్యం కాకపోవడంతో పాటు అలికిడి వినిపించడంతో లాభం లేదనుకుని వచ్చిన దారి నుంచే వెనక్కి వెళ్లాడు. కాగా, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చోరీ యత్నం అనంతరం పాత బస్తీలోని భవానీనగర్ దాకా వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు నిందితుడు అక్రమ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
నగదు ఉంటేనే చోరీ..
నిందితుడిని అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. చోరీకి యత్నించిన అక్రమ్ గతంలో ఢిల్లీలో పలు చోరీలకు పాల్పడ్డట్లు గుర్తించారు. అయితే బంగారం, ఇతర వస్తువులు చోరీ చేస్తే వాటిని అమ్మడం కష్టమని, అమ్మినా పోలీసులు రికవరీ పేరుతో వెంటాడుతుంటారని భావించిన అక్రమ్ కేవలం నగదు దొరికితేనే చోరీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. చోరీ చేసిన తర్వాత సులభంగా పారిపోయేందుకు అవకాశం ఉన్నందునే అ ఇంటిని ఎంపిక చేసుకున్నానని. ఎంపీ ఇల్లు అని తెలియదు అని విచారణ లో నిందితుడు వెల్లడించాడు.