అల్లాపూర్, డిసెంబర్ 3: ప్రభుత్వ ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలతో పాటు, బస్తీ దవాఖానల్లో సమస్యలు తిష్టి వేశాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్నగర్ ప్రభుత్వ దవాఖానను స్థానిక కార్పొరేటర్ సబీహా బేగంతో ఎమ్మెల్యే కృష్ణారావు కలిసి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో తరుచు మందుల కొరత, ప్రధానంగా రాత్రి వేళల్లో వైద్య సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఎమ్మెల్యేకు వివరించారు. మందుల కొరతపై ఆస్పత్రి డ్యూటీ డాక్టర్ను ఎమ్మెల్యే నిలదీయగా, పై నుంచే మందులు సరఫరా కావడం లేదని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మహా నగరంలో 150 బస్తీ దవాఖానలు అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తుచేశారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, గత ఏడాదిగా బస్తీ దవాఖానల నిర్వహణ గాలికి ఒదిలేశారని మండిపడ్డారు. బస్తీ దవాఖానలో బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేసేందుకు కనీస వైద్య పరికరాలు కూడా లేని దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఉన్నతాధికారులు, వైద్యారోగ్య శాఖ మంత్రికి ప్రజల సమస్యలు పట్టవా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించి ప్రభుత్వ దవాఖానల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్, జహెద్ షరీఫ్ బాబా, నాగుల సత్యం, వీరారెడ్డి, బొల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.