సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ శ్రీబాల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన సురీ లీల నవీన్ సాయి 2019లో పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. వివిధ లోన్ యాప్‌ల నుంచి అప్పులు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు లు తిరిగి చెల్లించాలంటూ వేధింపులు మొదలయ్యాయి. దీంతో తన అప్పులు తీర్చడంతో పాటు విలాసవంతమైన జీవితం గడిపేందుకు డ్రగ్స్ దందా చేయాలని ప్లాన్ చేశాడు. ఒంగోలుకు చెందిన బొర్ర వీరసాయి తేజతో స్నేహం కుదిరింది. ఇద్దరు కలిసి హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో ఉంటూ డ్రగ్స్ వాడుతున్నారు.
నవీన్ సాయికి ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా చేసే స్మగ్లర్‌తో పరిచయం ఏర్పడింది. నవీన్ సాయి, సాయి తేజా ఇద్దరు కలిసి ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి.. హైదరాబాద్‌లో జరిగే న్యూఇయర్ వేడుకల్లో విక్రయించేందుకు స్కెచ్ వేశారు. ఢిల్లీలో ఒక గ్రాము ఎండీఎంఏ డ్రగ్‌ను రూ.2వేలకు కొని.. హైదరాబాద్‌లో రూ.6వేల నుంచి రూ.8వేలకు, కొకైన్ రూ.10వేలకు కొని, రూ.17వేలకు, బ్రౌన్ షూగర్ రూ. 5 వేలకు కొని, రూ.10వేలకు హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు ఢిల్లీలో డ్రగ్స్ కొనుగోలు చేసి.. సరఫరా చేసేందుకు జూబ్లీహిల్స్ రోడ్డు నం. 36లోని టానిక్ లిక్కర్ మార్ట్ వద్ద కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా నేతృత్వంలోని బృందం ఇద్దరిని అరెస్ట్ చేసింది. వారి నుంచి 100 గ్రాముల ఎండీఎంఏ, 11.6గ్రాముల బ్రౌన్ షూగర్, 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ రూ.7.5లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసును జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ మురళీధర్ కథనం ప్రకారం.. యూపీకి చెందిన ఉమేశ్ తివారీ జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ఫతేనగర్‌లో ఉంటున్నాడు. రాజస్థాన్‌కు చెందిన సురేశ్ దేవసి, రావల్ల రామ్ కూకట్పల్లి ప్రాంతంలో ఉంటున్నారు. ఈ ముగ్గురు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. తమ సొంతానికి వాడటంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నారు. ఇటీవల రాజాస్థాన్‌లో ఒక డ్రగ్ సరఫరాదారు నుంచి హెరాయిన్ కొనుగోలుచేసి హైదరాబాద్‌కు తెచ్చారు. మీర్‌పేట ఠాణా పరిధిలో ఆ డ్రగ్‌ను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా.. పొలీసులు నిఘా పెట్టి ముగ్గురిని పట్టుకున్నారు. వారి నుంచి 15 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దర్ని సౌత్ ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ శ్రీబాల కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన కనుకుర్తి సాయి నవీన్ అలియాస్ నవీన్, చాట్ల వంశీ స్నేహితులు. వంశీ డిసెంబర్ నెలలో ఒడిశాకు వెళ్లి.. అక్కడ 3 కిలోల గంజాయి కొని తిరిగి వచ్చాడు. అందులో రెండు కిలోలు కిలో రూ.3వేల చొప్పున సాయి నవీన్‌కు విక్రయించాడు. అతడు 100గ్రాములకు ఒక ప్యాకెట్ చేసి ఒకో ప్యాకెట్ వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఓయూ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి హబ్సిగూడలో సాయి నవీన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, అతడి వద్ద రెండు కిలోల గంజాయి లభించింది. అతడి స్నేహితుడు వంశీని అరెస్ట్ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
హిమాయత్‌నగర్ : గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్టయిన సంఘటన నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్చార్జి సీఐ ఖాజామొయినుద్దీన్ కథనం ప్రకారం.. ఒడిశాలోని మల్కాన్‌గిరి నివాసి మానస్కంటి బిస్వాస్, బలరాం మండల్ కలిసి నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం సీబీఎస్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో మానస్కంటి బిస్వాస్, బలరాం మండల్ ఒక ద్విచక్ర వాహనం వద్ద అనుమానాస్పదంగా నిలబడి ఉండటంతో పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో 9 కిలోల ఎండు గంజాయి, రెండు సెల్ఫోన్లు లభించాయి. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 9 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి సీఐ తెలిపారు.