గ్రేటర్ వాసులకు సమృద్ధిగా నీరందించడమే ధ్యేయంగా జలమండలి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది. ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నది. ఫిబ్రవరి మొదటివారంలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఈ నేపథ్యంలో భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటిని సాధించే దిశగా జలమండలి పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూ.. రూ.5,937 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించి.. సోమవారం ప్రభుత్వానికి సమర్పించింది.
సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : పెరుగుతున్న జానాభాకు అనుగుణంగా నీటి సరఫరా, మురుగు నీటి శుద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు జలమండలి మరింత పటిష్టంగా ప్రణాళికలు రూపొందించింది. నాడు వేసవిలో సరిపడా తాగునీరు లేక జనం అల్లాడిపోయే దశ నుంచి నేడు నగరంతో పాటు శివారు గ్రామాలకు సైతం నీరందించే స్థితికి జలమండలి చేరుకొని ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందిస్తున్నది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నేపథ్యంలో జలమండలి రూ.5937 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించి సోమవారం ప్రభుత్వానికి సమర్పించింది.
ఇందులో ప్రస్తుతం కొనసాగుతున్న సుంకిశాల పథకంతో పాటు 20 కేఎల్ ఉచిత తాగునీటి పథకం, రుణాల చెల్లింపులు, విద్యుత్ రాయితీలు, ముఖ్యంగా అభివృద్ధి పనులకు పెద్ద పీట వేశారు. భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా ఈ బడ్జెట్‌ను రూపొందించగా.. ప్రతి ఏటా తరహాలోనే ఈ సారి కూడా ఆశించిన స్థాయిలో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు సమృద్ధిగా నీరందించడమే లక్ష్యంగా జలమండలి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి తన పరిధిని మరింత విస్తరించుకుంటూ.. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు లోపలి గ్రామాలకు తాగునీరు అందిస్తున్నది. అంతేకాకుండా మురుగునీటి శుద్ధిని సమర్థవంతంగా నిర్వహిస్తూ.. ప్రస్తుతం ఓఆర్ఆర్ లోపలి వరకు నగర శివారు ప్రాంతాల్లో సీవరేజీ నిర్వహణ బాధ్యతలు చేపట్టి తన సేవలను విసృ్తత పరిచింది. ఈ క్రమంలోనే నిత్యం 1257.50 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) మురుగు నీరు శుద్ధి చేయాలనే లక్ష్యంతో మొత్తం 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలను రూ.3,866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నది. ఈ ఏడాది చివరి నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి వందకు వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసి దేశంలోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నది.
వరుసగా ఐదేళ్లు కరువు వచ్చినా.. తాగునీటి సరఫరాకు ఎలాంటి డోకా లేకుండా రూ.1450 కోట్లతో సుంకిశాల వంటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఈ పనులను పూర్తి చేసి ఇకడి నుంచి 20 టీఎంసీల నీరు తరలించనున్నారు. దీనికి తోడుగా ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గృహ లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు రూ.1200 కోట్లతో చేపట్టిన ఓఆర్ఆర్-2 ప్రాజెక్టు పూర్తి ఫలాలను వచ్చే వేసవి నాటికల్లా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్లాన్, నాన్ప్లాన్కు గాను తాగునీటి, మురుగునీటి విస్తరణ, అభివృద్ధి, సీవరేజీ మాస్టర్‌ప్లాన్, వాటర్ సెఫ్టీ ప్లాన్, మురికివాడల అభివృద్ధి, మూసీ ఆధునీకరణ పనులు, ఎస్టీపీ వర్క్స్‌తో పాటు ఈ సారి బడ్జెట్లో కొత్త వనరులకు పెద్దపీట వేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు వరం లాంటి ఉచితంగా 20 వేల లీటర్ల మంచినీటి పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలోని గృహ కనెక్షన్లు కలిగిన వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని అందించడం ఈ పథకం ఉద్దేశం. 2021 జనవరి 12వ తేదీన మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బోరబండలోని ఎస్పీఆర్హిల్స్, రహమత్‌నగర్‌లో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. లక్షలాది మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ మేరకు వినియోగదారులకు 2020 డిసెంబరు నుంచి 2021 డిసెంబరు వరకు 13 నెలల బిల్లులను ప్రభుత్వం రూ.520 కోట్లు మాఫీ చేసింది. కాగా గతేడాది ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ. 250 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.480 కోట్లు కేటాయించాలంటూ జలమండలి ప్రభుత్వానికి విన్నవించింది.