సిటీ బ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): జలమండలి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, నిర్వాహణలోపం కారణంగా జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నీరు కలుషితం అవుతోందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో మహానగరానికి సరఫరా అయ్యే తాగునీరు సురక్షితమైనదేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతనెల ఓ ట్యాంకర్‌తో సెప్టిక్ వ్యర్థాలను గండిపేట జలాశయంలో పారయబోయడం కలకలం రేపింది.
ఈసంఘటనతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మనం నిత్యం తాగే నీళ్లలో సెప్టిక్ వ్యర్థాలు కలుస్తున్నాయా? అని ఆందోళనకు గురయ్యారు. పటిష్టమైన వ్యవస్థను కలిగి ఉండి, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జలమండలి శివారు జిల్ల్లాల్లో కూడా విస్తరించి ఉంది. ఇంతపెద్ద నెట్వర్క్ ఉన్నప్పటికీ జంట జలాశయాల్లోకి వ్యర్థాల డంపింగ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం జలమండలితో పాటు విజిలెన్స్ అధికారుల నిఘా ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులు యథేచ్ఛగా సెప్టిక్ వ్యర్థాలను జలాశయాల్లో పారబోస్తున్నారంటే నిఘా వ్యవస్థ నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. అదేవిధంగా గండిపేట నుంచి ఆసిఫ్‌నగర్ దాకా 14 కిలోమీటర్లున్న కాండ్యూట్ నీరు కూడా అక్కడక్కడా కలుషితమవుతున్నది. కాండ్యూట్లో కొనిచోట్ల పైకప్పులుగా ఉంచిన రాళ్ల మధ్య గ్యాప్‌లు ఏర్పడి దానిపైన చెత్త పారబోస్తుండటంతో నీరు కలుషితమవుతున్నది.

Usman Sagar1
పర్యవేక్షణ వైఫల్యమే కారణమా?
జంట జలాశయాల్లో సెప్టిక్ వ్యర్థాలతో పాటు ఇతర వ్యర్థాల పారబోసిన ఘటనలు మునుపెన్నడూ వెలుగులోకి రాలేదు. ఇటీవల జరిగిన ఘటనతో జలమండలి అధికారులు, సిబ్బంది పనితీరుపై సందేహాలు కలుగుతున్నాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణకు ఇద్దరు జలమండలి సిబ్బంది, ఒక హోంగార్డు చొప్పున పెట్రోలింగ్ నిర్వహిస్తారు. వీరు ఉదయం 10 గంటలకు విధుల్లోకి వచ్చి సాయంత్రం దాకా పెట్రోలింగ్ నిర్వహిస్తారని అధికారులు చెప్తున్నారు.
సెప్టిక్ ట్యాంకర్ ఓనర్లు ఇదే అదనుగా తెల్లవారుజాము(ఉదయం 5గంటల) నుంచి ట్యాంకర్ల ద్వారా సెప్టిక్ వ్యర్థాలను జలాశయాల్లోకి వదులుతున్నట్లు సమాచారం. గతనెల 17న కూడా శివనాయక్ అనే వ్యక్తి ఉదయం 8 గంటలకు సెప్టిక్ వ్యర్థాలను ఉస్మాన్‌సాగర్ జలాశయంలో పారబోసేందుకు ప్రయత్నించాడు. జలమండలి సిబ్బంది ఉదయం 10 గంటలకు విధుల్లోకి వస్తుండటంతో అప్పటికే అక్రమార్కులు తమ పని కానిచ్చేస్తున్నట్లు తెలుస్తున్నది. నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించే నీటిలో సెప్టిక్ వ్యర్థాలు, గృహ వ్యర్థాలను కలవనీయకుండా ఉండాలంటే జలమండలి నిరంతర పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికైనా పెట్రోలింగ్‌కు మరింత మందిని నియమించి షిప్టుల వారీగా నిఘా ఉంచాలని నగరప్రజలు కోరుతున్నారు.
ఉస్మాన్‌సాగర్‌లోకి యథేచ్చగా గృహ వ్యర్థాలు..
జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్‌సాగర్‌లో పరీవాహక ప్రాంతాల ప్రజలు.. గృహవ్యర్థాలతో పాటు చెత్తను బస్తాలు, పాలిథిన్ కవర్లలో తీసుకొచ్చి జలాశయంలో పారబోస్తున్నారు. దీంతో జలాశయం చుట్టూ చెత్త కుప్పలుగా పేరుకుపోతున్నది. దీంతో తాగునీరు కలుషితం అవుతున్నది. అదేవిధంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వ్యర్థాలను కూడా పడేస్తున్నారు. దీంతో ఆ వ్యర్థాలు కుళ్లిపోయి నీరు కలుషితమవడంతో పాటు దుర్వాసన వెదజల్లుతున్నది. కొన్నిచోట్ల గృహ వ్యర్థాలతో పాటు, ప్లాస్టిక్ వ్యర్థాలు విచ్చలవిడిగా పడేస్తున్నారు. జంట జలాశయాల చుట్టూ ఫంక్షన్ హాళ్లు, రిసార్ట్స్ ఉండటంతో వాటిల్లో ఫంక్షన్లు, వేడుకల కోసం ఏర్పాటు చేసిన అలంకరణ వ్యర్థాలను కూడా పడేస్తున్నారు. ఎవరుపడితే వారు చెత్తను జలాశయాల్లో పడేసి కలుషితం చేస్తున్నారు. నగరంలోని ప్రజలకు మంచినీటిని అందించే జలవనరులను సంరక్షించాల్సిన జలమండలి అధికారులు మేల్కొని నీటిని కలుషితం కాకుండా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.