గ్రేటర్ శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపించినా చెత్త, బురద, మురుగు నీరుతో నింపేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో రోజుల తరబడిగా ఖాళీగా ఉంటున్న ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో గుట్టలు గుట్టలుగా చెత్త పడేస్తున్నారు. హోటళ్లు, ఇండ్లు, ఆఫీసుల నుంచి వచ్చే వ్యర్థ జలాలను వదులుతున్నారు. ఏండ్ల తరబడిగా వదులుతున్న మురుగు, వ్యర్థాలతో పరిసర ప్రాంతాల్లో ముక్కుపుటాలదిరే దుర్వాసన వెదజల్లుతున్నది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు దుర్వాసన భరించలేక పోతున్నారు. మురుగు నీరు నిల్వ ఉండటంతో పందులకు ఆవాసాలుగా మారుతున్నది. దోమలు వ్యాప్తి చెంది పరసర ప్రాంత ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.
సిటీ బ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : నగర శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఖాళీ స్థలాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. ఎక్కడ చూసినా ఖాళీ స్థలాలు మురుగు, గృహ, హోటళ్ల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు దర్శనిమిస్తున్నాయి. ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లోని వివాదాల్లో ఉన్న భూముల్లోకి పరిసరాల్లోని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేటు కార్యాలయాల నుంచి వచ్చే వ్యర్థాలను ఇష్టానుసారంగా వదులుతున్నారు.
కాలువలు, పైపులు ఏర్పాటు చేసి మరీ ఆయా స్థలాల్లోకి మురుగు, ఆహార వ్యర్థాలను పంపిస్తున్నారు. శివారు ప్రాంతాలైన కోకాపేట, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గోపన్‌పల్లి తండా, వట్టినాగులపల్లి, గౌలిదొడ్డి, నార్సింగి, మణికొండ, తెల్లాపూర్, అమీన్పూర్ తదితర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. వీటితో పాటు కోర్ సిటీలోని ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, కూకట్‌పల్లితో పాటు అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో దవాఖానల నుంచి వచ్చే జీవ వ్యర్థాలను కూడా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌ల నుంచి వచ్చే వ్యర్థాలను కూడా రాత్రిళ్లు ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో కుప్పలుకుప్పలుగా పడేస్తున్నారు. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యర్థాల పారబోత యథేచ్ఛగా కొనసాగుతున్నది.
వ్యాధుల బారిన స్థానికులు..
వ్యర్థ జలాలు, చెత్త ఏండ్ల తరబడిగా పేరుకుపోవడంతో ఖాళీ స్థలాలు కాలుష్యంలో కూరుకుపోతున్నాయి. గృహ వ్యర్థాలతో పాటు చెత్తను ఏండ్ల తరబడి డంప్ చేయడంతో దుర్వాసన వెదజల్లుతూ ఆయా ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతున్నది. పరిసరాల్లోని ప్రజలు కలుషిత గాలిని పీలుస్తూ శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అదేవిధంగా వ్యర్థ జలాలు, మురుగు నీరు ఏండ్ల తరబడి నిల్వ ఉండి నేల కాలుష్యం ఏర్పడుతున్నది. దీనికి తోడు మురుగు నిల్వ ఉన్న ప్రాంతాలతో పాటు పరిసరాల్లో భూగర్భ జలాలు తీవ్ర స్థాయిలో కలుషితమవుతున్నాయి.
ఆయా ప్రాంతాల్లోని బోర్లలోంచి కలుషిత నీరు వస్తున్నది. దీని ద్వారా ఆ నీటిని వాడిన ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. వానాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో చెత్తను కుప్పలు తెప్పలుగా వేస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కాలుష్య కాసారాలుగా మారుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే నగరంలో కాలుష్యం తీవ్ర స్థాయిచేరే ప్రమాదముంది.