అమీర్‌పేట, జూలై 15: సంచలనం సృష్టించిన ట్రాన్స్‌జెండర్ షీలా హత్య కేసు మిస్టరీ వీడింది. నలుగురు పాత నేరస్తులను అరెస్టు చేసిన సనత్‌నగర్ పోలీసులు సోమవారం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ వెల్లడించారు. బాలానగర్ రాజుకాలనీకి చెందిన సాగర్సింగ్, ప్రవీణ్, సురారం ప్రాంతానికి చెందిన కరణ్ బిశ్వజిత్, రాజుకాలనీకి చెందిన బి.అభినవ్ స్నేహితులు. వీరు నిత్యం గంజాయి మత్తులో పలువురిని డబ్బుల కోసం వేధిస్తూ.. దాడులు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. వీరిపై కేసులు కూడా ఉన్నాయి. ట్రాన్స్‌జెండర్ షీలా ఈ నెల 12న ఉదయం 4 గంటల సమయంలో సాగర్ సింగ్, ప్రవీణ్, కరణ్, అభినవ్‌కు కనిపించింది. ఈ నలుగురు డబ్బు కోసం షీలాను వేధించడంతో తన వద్దనున్న రూ.3 వేలు వారికిచ్చింది. ఈ డబ్బు సరిపోవంటూ షీలాను ఇంటికి తీసుకెళ్లి అక్కడ కూడా డబ్బుల కోసం వెతికారు. చివరికి ఫోన్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేయాలంటూ కత్తి, కర్రలతో గాయాలు చేశారు.
భయంతో షీలా జీ-పే.. పాస్వర్డ్ చెప్పింది. ఆ పాస్వర్డ్ తప్పని తేలడంతో వారు ఆగ్రహంతో మరింత తీవ్రంగా గాయపర్చడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని తెల్లవారక ముందే పడేయాలనే ఆలోచనతో ఫతేనగర్ వాల్మీకినగర్‌లోని శ్మశానవాటిక దగ్గరలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో పడవేసి వెళ్లిపోయారు. ఉదయం సమాచారం అందుకున్న సనత్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్దనుంచి రూ.2,500నగదు, ఒక కత్తి, మోటర్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఏసీపీ ఎం.హనుమంతరావు, సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ పురేందర్‌రెడ్డి, బాలానగర్ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్, సనత్‌నగర్ డీఐ నాగిరెడ్డితో పాటు పీసీలు శ్రీనివాస్ (క్రైమ్), శేఖర్, సతీష్, శ్రీశైలం, కృష్ణమోహన్‌ను డీసీపీ సురేశ్‌కుమార్ అభినందించారు.