సిటీబ్యూరో, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): అర్ధరాత్రి తాళాలు పగులగొట్టి చోరీలు చేయడం బోర్కొట్టిందేమో.. ! కొంచెం కొత్తగా చోరీ చేయాలనుకుంటున్నారు దొంగలు. ఇందుకోసం ఖరీదైన ఇళ్లను, నగల పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని అక్కడ పనివాళ్లుగా చేరుతున్నారు. కొన్ని నెలలు గడిచాక డబ్బులు, నగలు, ఆభరణాలు.. ఇలా విలువైన వస్తువులు ఎక్కడ ఉంటాయో కనిపెట్టి అదును చూసి చోరీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు హైదరాబాదీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. వరుస సంఘటనలతో హైదరాబాదీలు బెంబేలెత్తుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయపడుతున్నారు. ప్రధానంగా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వ్యక్తులు ఈ దొంగతనాలకు, హత్యలకు, దోపిడీలకు పాల్పడుతుండడంతో ఎవరిని నమ్మాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ దొంగల రూటే సెపరేటు. వారు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలనుంచి హైదరాబాద్కు వలస వస్తారు. మెట్రో నగరాల్లో ఖరీదైన ఇళ్లు, వృద్దులు ఒంటరిగా ఉండే ఇళ్లు ఎంచుకుంటారు. నమ్మకంగా ఇంటి పని, బయటిపని పనిచేస్తామంటారు. వారి మాటలతో ఎదుటివారిని మెప్పిస్తారు.. ఇంటి పనికి ఒప్పుకుని ఇంట్లో వస్తువులపై నిఘా పెడతారు. సందుచూసుకుని అన్నీ దోచుకుని పరారవుతారు. దీంతో లబోదిబోమంటూ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
పనిమనుషుల కొరతతో..!
హైదరాబాద్లో పనిమనుషుల కొరత ఉండడంతో సహజంగా యజమానులు ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వచ్చే వారిపై ఆధారపడుతారు. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారే ఎక్కువగా సిటీలో పలు రకాల పనుల్లో చేరుతున్నారని పోలీసులు చెప్పారు. వీరు వచ్చే సమయంలో తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఎక్కడ పని ఉందో తెలుసుకుని ఆ యజమానుల వద్దకు చేరుతారు. తక్కువ రేట్లో పనిచేస్తామనడంతో యజమానులు వీరివైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా అదే ఇంట్లో ఇతర పనులకు కూడా తమ వారినే తీసుకొని వస్తున్నారు. నెలల తరబడి పనిచేస్తూ యజమానుల విశ్వాసాన్ని చూరగొంటారు. అదును చూసి ఆ ఇంట్లో నగదు, నగలను, ఇతర సామాగ్రి ఎంత ఉందో అంచనా వేసి తమతో పాటు పనిచేసే వారిని కలుపుకుని తమ ప్రాంతానికి చెందిన మరో ఒకరిద్దరిని సహాయానికి పిలిచి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరు చేసే పని విషయంలో యజమానులు అసలు వీరిని అనుమానించే అవకాశమే లేకుండా చేస్తున్నారు. దీంతో యజమానులు వీరిని నమ్మి ఇల్లు వదిలేసి వెళ్లడం, ఒకట్రెండు సార్లు గమనించిన తర్వాత ఆ ఇంటిని గుల్ల చేసి పారిపోవడం పనిమనునషుల పనిగా మారింది.
పనివాళ్ల వివరాలు తెలుసుకోండి
ఎవరైనా తమ ఇంట్లో కానీ, ఫ్యాక్టరీలోకానీ పనివాళ్లను నియమించుకునే ముందు వారి వివరాలను తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఈ వివరాలను సమీపంలోని పోలీస్స్టేషన్లో ఇచ్చి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకుంటే పాతదొంగల బెడదను అరికట్టొచ్చని చెబుతున్నారు. నగరంలో చాలామంది ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని, ఇప్పటికైనా పనివాళ్ల వివరాలు దగ్గర పెట్టుకోవాలని, వీలైతే చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.