జీహెచ్ఎంసీలో టెండర్ల ప్రక్రియ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. నిబంధనలను తుంగలో తొకి,నకిలీ పత్రాలతో టెండర్లు దకించుకోవడమే కాకుండా.. ఏకంగా ప్రభుత్వానికే టోకరా వేస్తున్న ఓ సంస్థ బాగోతం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. దుర్గా భవాని ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ, దాని అనుబంధ వ్యక్తులు కలిసి సాగిస్తున్న ఈ ‘టెండర్ దందా’పై విచారణ జరిపించాలంటూ కమిషనర్ కర్ణన్‌ను కొందరు ఏజెన్సీలు, కనీస వేతనాలు ఇవ్వని ఏజెన్సీలకే మళ్లీ పట్టం కడుతున్నారంటూ ఓ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనం.
సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ ) : కొన్ని నెలలుగా ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్లలో హెల్త్ , ఇంజినీరింగ్, లీగల్ సెక్షన్లలో మ్యాన్‌పవర్ టెండర్లలో అడ్డదారిలో పనులు దక్కించుకుంటున్నట్లు ప్రధాన ఆరోపణ. ఓ మహిళ సదరు శ్రీ దుర్గా భవాని ఎంటర్ ప్రైజెస్ భాగస్వామిగా టెండర్లు దక్కించుకున్నారని, వాస్తవానికి ఏజెన్సీ పేర్కొన్న (పాన్ నం: ఏసీయూఎఫ్ఎస్ 3266) పేరు మీద టెండర్ దకగా, బిల్లుల చెల్లింపులు మాత్రం మహిళా వ్యక్తిగత పాన్ (ఏవైఎంపీ8481 బీ) ఖాతాకు వెళ్లడం గమనార్హం. ఇది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనే కాకుండా, ప్రణాళికాబద్ధమైన మోసమని తోటి కాంట్రాక్టర్లు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ అక్రమ టెండర్లు, బిల్లుల మంజూరులో క్షేత్రస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్లలో జరిగిన ఈ అక్రమాలపై అదనపు కమిషనర్ విచారణకు ఆదేశించినా, కొందరు ఎస్ఈలు, ఈఈలు విచారణను నీరుగార్చుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఒకే పేరు.. ఐదు వేర్వేరు సంస్థల పేరుతో చలామణి అవుతున్న సదరు సంస్థకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఇతరులను టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకోవడం, షార్ట్ టెండర్ల విషయంలో కనీస గడువు (7-10 రోజులు) పాటించకపోవడం వంటి నిబంధనలతో పనుల అప్పగింతలో రెడ్ కార్పెట్ వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
ఒక జోన్లో పార్టనర్ షిప్ ఫర్మ్ పేరుతో, మరో జోన్లో ఇండివిజువల్ పేరుతో టెండర్లు వేస్తూ, ఒకే పాన్ కార్డును ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా వినియోగిస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని, 2021 లో రద్దయిన పార్టనర్ షిప్ డీడ్ ను 2025లో కూడా వాడుతూ టెండర్లలో పాల్గొనడంపై కమిషనర్ విచారణ జరపాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. నకిలీ ధ్రువపత్రాలతో కోట్లాది రూపాయల టెండర్లు కొల్లగొడుతున్న వారిపై, సహకరిస్తున్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్ విభాగంతో సమగ్ర విచారణ జరిపిం చి, బాధ్యులను బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరు తూ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.