హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): మూసీ నది సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అసంబద్ధ నిర్ణయాలు, ప్రజాధనం లూటీని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) నడుం బిగించింది. శనివారం (ఈ నెల 4వ తేదీ) నుంచి 14వ తేదీ వరకు బీఆర్ఎస్వీ మూసీ పోరుబాటకు సంకల్పించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక ఇల్లు కూడా కూల్చకుండా మూసీ ప్రక్షాళన కోసం తీసుకున్న నిర్ణయాలు, మురుగునీటి శుద్ధి కోసం నిర్మించిన ఎస్టీపీలు, తక్కువ వ్యయంతో మూసీ ప్రక్షాళన కోసం చేసిన ప్రణాళికలను మూసీ పరివాహాక ప్రాంతాల ప్రజలకు బీఆర్ఎస్వీ బృందాలకు వివరించనున్నాయి. అదే సందర్భంలో గత రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీపీలను పూర్తిచేయకుండా మూసీ సుందరీకరణ పేరుతో లక్షల ఇళ్లను కూల్చి, పేదలను రోడ్డున పడేసి చేసే అభివృద్ధి ఎవరి కోసం? కేవలం ప్రజాధనాన్ని దోచుకోవడం కోసం కాదా? అనే చర్చను ప్రజల్లో పెట్టనున్నారు. పోస్టర్లు, కరపత్రాల ద్వారా, చిన్నచిన్న సమావేశాల ద్వారా మూసీ సుందరీకరణ పేరుతో జరిగే ధనదోపిడీపై ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు.
బృందాల ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీఆర్ఎస్వీ నాయకులతో 50 బృందాలను ఏర్పాటు చేశారు. ఒకో బృందంలో 10 మంది సభ్యులు ఉంటారు. వీరికి ఒకో ప్రాంతాన్ని (ఏరియా) బాధ్యతగా అప్పగించారు. ఈ పది రోజులు ఆయా బృందాలు పోస్టర్లు, లక్ష కరపత్రాల ద్వారా మూసీ సుందరీకరణ వల్ల జరిగే నష్టాన్ని, ఒకో పౌరుడిపై పడే ఆర్థిక భారాన్ని ప్రజలకు వివరించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక ఇల్లు కూడా కూల్చకుండా మూసీ ప్రక్షాళన కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరిస్తారు. మురుగునీటి శుద్ధి కోసం అప్పట్లోనే ఎస్టీపీల నిర్మాణాలు తలపెట్టారని, కానీ గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను పక్కనపెట్టిందని, కొద్దిపాటి నిధులతో వాటిని పుర్తిచేస్తే మూసీ ప్రక్షాళన సాధ్యమవుతుందని వెల్లడిస్తారు.
లక్షన్నర కోట్లు ఎవరి కోసం?
లక్షన్నర కోట్ల ప్రజాదనం చేపట్టే మూసీ సుందరీకరణ వల్ల ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుంది? ఏ వర్గానికి లాభం చేకూరుతుంది? అనే ప్రశ్నలు ప్రజలకు వేసి వారి అభిప్రాయం తెలుసుకోనున్నారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో వ్యవసాయం బాగుపడి, రికార్డు స్థాయిలో ధాన్యం పండింది. మరి మూసీ సుందరీకరణ వల్ల వచ్చే లాభమేంటో ప్రభుత్వం చెప్పాలని ప్రజల ద్వారా డిమాండ్ వచ్చేలా చైతన్యం తీసుకురానున్నారు. సుందరీకరణ పేరుతో వేలాది ఇండ్లను కూల్చివేయడంపై బీఆర్ఎస్వీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం వేస్తున్నది.
తదుపరి కాలేజీల్లో సమావేశాలు
శనివారం నుంచి ఏప్రిల్ 14 వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్రలు, అవగాహన సదస్సు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాం. తెలంగాణభవన్ నుంచి శనివారం ఉదయం 7 గంటలకు విద్యార్థి బృందాలు వాటికి కేటాయించిన ప్రాంతాలకు బయలుదేరుతాయి. పది రోజులపాటు కేటాయించిన ప్రాంతంలో ఆ బృందం మూసీ సుందరీకరణ వల్ల నష్టాలను ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ప్రజలకు కలిగే నష్టాలు, ఆర్థికభారంపై ప్రజలను విద్యార్థి నేతలు చైతన్య పరుస్తారు.
14న హైదరాబాద్ కళాశాలల్లో మూసీ సుందరీకరణ వల్ల జరిగే నష్టంపై విద్యార్థులతో సభలు, సమావేశాలు జరుపుతాం. గత నెల తెలంగాణభవన్‌లో గతనెల 30న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌గారి సమక్షంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఈ పోరుబాట నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు మూసీ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాం. పేదల ఇళ్లను కాపాడుకోవడానికి, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను అడ్డుకోవడానికి విద్యార్థి లోకం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాం
-గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు