ఎటుచూసినా పచ్చని పంటపొలాలు…. మండుటెండల్లోనూ పారుతున్న వాగులు.. నిండుగా చెరువులు, చెక్‌డ్యామ్‌లు.. ఆకట్టుకునే సమీకృత మార్కెట్.. ఎత్తిపోస్తున్న పంప్‌హౌస్.. సముద్రాన్ని తలపించేలా రిజర్వాయర్లు.. ఆహ్లాదాన్ని పంచుతున్న అటవీ అందాలు. అడుగడుగునా అభివృద్ధి ఛాయలు. వీటన్నింటిని చూసి ఆశ్చర్య పోవడం మహారాష్ట్ర రైతులు, రైతు ప్రతినిధుల వంతైంది.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసిన మహారాష్ట్ర రైతు నేతలు, రైతులు ఫిదా అయ్యారు. ఆదివారం వారు సిద్దిపేట జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ములుగు రైతువేదిక, సింగాయిపల్లి అడవులు, గజ్వేల్ సమీకృత మార్కెట్, కోమటిబండ వద్ద మిషన్ భగీరథ, కూడవెల్లి వాగు, అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్, జిల్లా కలెక్టరేట్, నంగునూరు మండలం ఘనపూర్ చెక్‌డ్యామ్‌లను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ మోడల్ దేశమంతా రావాలని, ఇక్కడ రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ రాష్ట్రంలో కావాలని ఆకాంక్షించారు.
రైతు సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. నంగునూరు మండలం ఘనపూర్ చెక్‌డ్యామ్ వద్ద ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు మహారాష్ట్ర రైతులతో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రతి ఎకరాకు సాగు నీరు ఇస్తున్న విధానం, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌పై వివరించారు. రైతులకు వచ్చిన పలు సందేహాలను మంత్రి నివృత్తి చేశారు.
– గజ్వేల్/గజ్వేల్ అర్బన్/తొగుట/సిద్దిపేట అర్బన్/నంగునూరు, ఏప్రిల్ 2