జూబ్లీహిల్స్, జనవరి 4: తెలంగాణ ప్రభుత్వం ‘స్మార్ట్’ అంగన్వాడీ కేంద్రాల రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళలేని పేదింటి పిల్లలు తమ ఇంటికి సమీపంలో ఆటపాటలతో అక్షరాభ్యాసం చేసేందుకు ఆదర్శ అంగన్వాడీ కేంద్రాలను నెలకొల్పుతున్నారు. ఇప్పటికే అద్దె భవనాలలో కొనసాగుతున్న కేంద్రాలకు సొంత భవనాలు సమకూర్చడంతో పాటు ‘ప్లే స్కూ ల్లు’గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సొంత భవనాలున్న ఆయా కేంద్రాలను ఆధునీకరించి ‘స్మార్ట్’ అంగన్వాడీలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అంగన్వాడీలకు కొత్తరూపు ఇస్తున్నారు. ఇప్పటికే రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్పిఆర్ హిల్స్‌లో రోటరీ జూబ్లీహిల్స్, జీఈ అప్లియెన్సెస్ సంస్థల భాగస్వామ్యంతో రెండు అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు నాట్కో స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో మోడల్ అంగన్వాడీ భవనాన్ని నిర్మించారు.
నామమాత్రంగా ఉన్న నాటి అంగన్వాడీలకు సొంత భవనాలపై దృష్టి పెట్టిన అధికారులు పలుచోట్ల ఆధునీకరణ పనులు చేపడుతుండడంతో అంగన్వాడీ కేంద్రాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. రాష్ట్రంలోని 914 అంగన్వాడీ కేం ద్రాలకు కొత్త రూపునిచ్చేందుకు కృతనిశ్చయంతో ఉన్న అధికారులు తొలి విడత నగరంలో ఎంపికచేసిన కేంద్రాలను మోడల్ అంగన్వాడీలుగా తీర్చిదిద్దుతున్నారు.
ఆదర్శ అంగన్వాడీ కేంద్రాలకు నిలయం..
ఆదర్శ అంగన్వాడీ కేంద్రాలకు రహ్మత్‌నగర్ డివిజన్ నిలయంగా నిలుస్తుంది. గ్రేటర్లో పైలట్ ప్రాజెక్ట్‌గా నెలకొల్పిన 4 మోడల్ అంగన్వాడీలలో 3 కేంద్రాలు ఈ డివిజన్‌లోనే ఏర్పాటుకావడం విశేషం. బోరబండ తరువాత అత్యధిక బస్తీలున్న ఈ ప్రాంతంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2 మినీ మోడల్ అంగన్వాడీలను, నాట్కో ట్రస్ట్ ఒక ఆదర్శ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. నగరంలో మరికొన్ని మోడల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పా టు చేయనున్నామని అధికారులు వెల్లడించారు.
కొత్తగా 8 మోడల్ అంగన్వాడీలు
ఇటీవల ఏర్పాటుచేసిన 4 మోడల్ అంగన్వాడీ కేంద్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అంగన్వాడీ కేంద్రంలో వివిధ ఆట వస్తువులు ఏర్పాటు చేయడం తో పనులకు వెళ్లే తల్లిదండ్రులు చిన్న పిల్లలను కేంద్రాలలో వదిలేసి వెళ్తున్నారు. దీంతో ఆయా పిల్లలు ఆడుకుంటూ చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో 8 మోడల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– అకేశ్వరరావు, జిల్లా సంక్షేమ అధికారి