మేడ్చల్, జనవరి 8(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వివిధ రకాల పన్నులు రూ.212.48 కోట్లు వసూలు చేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్నగర్, నిజాంపేట్ నాలుగు కార్పొరేషన్లు కాగా, మేడ్చల్, తూంకుంట, గుండ్లపోచంపల్లి, నాగారం, ఘట్కేసర్, దమ్మాయిగూడ, పోచారం, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీలు ఉండగా, వీటిలో 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.212 కోట్ల పన్నుల వసూళ్లకు గాను రూ.110 కోట్లు వసూలు కాగా.. వచ్చే మార్చి నాటికి రూ.100 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామ పంచాయతీల్లో రూ.22.83 కోట్ల పన్నుల వసూళ్ల లక్ష్యానికిగాను ఇప్పటి వరకు రూ.11.53 కోట్లు వసూలయ్యాయి. మిగిలిన రూ. 11.30 కోట్ల వసూలు, మున్సిపాలిటీల్లో రూ.188 కోట్ల పన్నుల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు రూ.99 కోట్ల వరకు వసూలు కాగా, మరో రూ.88 కోట్లు వసూలు చేసేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. వందశాతం పన్నుల వసూళ్లు జరిగితే మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని మున్సిపల్ కమిషనర్లు, గ్రామ కార్యదర్శులు ప్రజలకు వివరిస్తూ వసూలు చేస్తున్నారు.