సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ ) సమ్మర్ వచ్చిందంటే చాలు చిన్నారుల నుంచి పెద్దలు ఈత కొలనులను ఆశ్రయిస్తుంటారు. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఈత నేర్పిస్తుంటారు. మరికొందరు ఈత ద్వారా చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరాటపడుతుంటారు. ఐతే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే స్విమ్మింగ్ ఫూల్స్ సామాన్యులకు దూరంగా ఉంటారు. ఇందుకు ఫీజుల భారమే కారణం.
ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా వేసవిలో పేద, మధ్య తరగతి ప్రజల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ దాదాపు 12 చోట్ల ఈత కొలనుల నిర్వహణ చేపడుతున్నది. మార్చి నెలాఖరు పూర్తవుతున్నా ఈత కొలనులను అందుబాటులోకి తీసుకురాలేదు. గడిచిన రెండు, మూడు రోజుల నుంచి వరుసగా ఈత కొలనులను ప్రారంభిస్తున్నది. సికింద్రాబాద్‌లో రెండు, ఎల్భీనగర్‌లో రెండు, చార్మినార్‌లో రెండు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఖైరతాబాద్‌లోని స్విమ్మింగ్ ఫూల్‌ను సోమవారం (నేడు) సాయంత్రంలోగా అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నారు. మిగిలిన ఐదు చోట్ల ఈత కొలనుల మరమ్మతుల దృష్ట్యా మరింత సమయం పట్టే అవకాశముందని స్పోర్ట్స్ విభాగం అధికారులు వెల్లడించారు. మొఘల్ పురలోని స్పోర్ట్స్ కాంప్లెక్సులో 2, చందూలాల్ బారాదరీ క్రీడా ప్రాంగణంలో 2, విజయనగర్ కాలనీ 2, వనస్థలిపురం రెడ్ వాటర్ ట్యాంక్ పక్కన, వనస్థలిపురం ఫేజ్ 4, గోల్కొండ క్రీడా ప్రాంగణంలో, అంబర్ పేట స్పోర్ట్స్ కాంప్లెక్సులో 2, అమీర్ పేట్ స్టేడియంలో, సికింద్రాబాద్, కూకట్పల్లి, సనత్ నగర్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ ఫూల్స్ నిర్వహణ ఉంటుంది.
ఇప్పటికే కొన్ని చోట్ల అందుబాటులోకి వచ్చాయి. కాగా నెలకు ఒక వ్యక్తి సభ్యత్వ రుసుం రూ.500లు రోజూ గంట పాటు ఈత కొట్టే అవకాశం ఉంటుంది. https://sports.ghmc.gov.in/ వెబ్ లింకు ద్వారా రిజిస్టర్ అయి, లాగిన్ అయ్యాక.. ఈత కొలను సేవలు ఎంచుకుని ఫీజు చెల్లించాలి. రశీదును సంబంధిత కొలను వద్దనున్న జీహెచ్ఎంసీ అధికారికివ్వాలి. ఫిట్నెస్ సర్టిఫికెట్, 2 పాస్ పోర్టు సైజు ఫొటోలిచ్చి గుర్తింపు కార్డు పొందాలి.
టీబీ, హెపటైటీస్ బి, తామర, ఇతర అనారోగ్య సమస్యలున్న వారిని అనుమతిస్తే ఇతరులకు అంటుకోవచ్చు. కొందరికి నీటిలో దిగితే ఫిట్స్ వస్తాయి. అందుకే డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసినట్లు జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ ఈత కొలనులోని నీటిని రోజూ నాణ్యమైన క్లోరిన్‌తో శుద్ధి చేస్తారు. స్నానాల గదుల్లో శరీరాన్ని శ్రుభం చేసుకుని స్విమ్ సూట్ దరించిన వారినే కొలనులోకి అనుమతిస్తారు. ప్రతి రోజు నలుగురు శిక్షకులు పర్యవేక్షిస్తారు. లైఫ్ గార్డులు అందుబాటులో ఉంటారు.