సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): నగరంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.2, కనిష్ఠం 26.0 డిగ్రీలు, గాలిలో తేమ 26శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
మారేడ్పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, మోండా మార్కెట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. కాగా, ద్రోణి ప్రభావం కొనసాగుతుండడంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.