సిటీబ్యూరో,/మల్కాజిగిరి జూలై 1 (నమస్తే తెలంగాణ ) : నగరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గందరగోళంలో సాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సగటు పంపిణీ రాష్ట్ర సగటు పంపిణీ 60 శాతానికి పైగా ఉంటే.. అత్యధిక ఓటర్లు, డివిజన్లు ఉన్న రాజధాని నగరంలో మాత్రం కేవలం 30 శాతానికే పరిమితమై వెనుకబడిపోయింది. నేటి (గురువారం) సాయంత్రంలోగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కచ్చితమైన డెడ్ లైన్ విధించడంతో అటు ఉన్నతాధికారుల్లో, ఇటు క్షేత్రస్థాయి సిబ్బందిలో తీవ్ర ఉతంఠ నెలకొంది.
హైదరాబాద్ లో మాత్రం కేవలం 30 శాతం ఫారాలు మాత్రమే పంపిణీ కావడం గమనార్హం. కాగా, నగరంలో ఈ ప్రక్రియ ఇంత నిదానంగా సాగడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎలాంటి సర్వేలలోనూ పాల్గొనని కొత్త సిబ్బందిని ఈ సారి సర్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులుగా నియమించారు. దీనివల్ల వారికి క్షేత్రస్థాయిలో అవగాహన లోపించి ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు నగరంలో ఓటర్లు ఇండ్లలో అందుబాటులో ఉండకపోవడం మరో పెద్ద శాపంగా మారింది. ఉపాధి, ఉద్యోగాల రీత్యా ఓటర్లు ఇండ్లకు తాళాలు వేసి వెళ్తుండటంతో.. ఫారాలు ఇవ్వడానికి బీఎల్ఓలు ఒకే ఇంటికి నాలుగైదు సార్లు తిరగాల్సి వస్తోందని లబోదిబోమంటున్నారు.
మొక్కబడిగానే ప్రక్రియ..
సర్‌లో భాగంగా బీఎల్ఓలకు పోలింగ్ స్టేషన్ల వారీగా విధులు కేటాయించారు. 12 వందల మంది ఓటర్లకు ఒక బీఎల్ఓ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బీఎల్ఓ ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ పత్రాలు అందజేయాలి. దీంతో ఇంటిలోని వారు పత్రాలు పూరించి, బీఎల్ఓలకు అందజేస్తారు. ఈ ప్రక్రియకు కటాఫ్ తేదీని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు అనుకున్న లక్ష్యం చేరలేదు.
సాఫ్ట్‌వేర్‌లో అనేక లోపాలు
కేంద్ర ఎన్నికల సంగం తీసుకొచ్చిన ఆన్లైన్ ఎన్యుమరేషన్ సాఫ్ట్‌వేర్‌లో పేరు తర్వాతే ఇంటిపేరు ఉంటేనే దరఖాస్తును ఆమోదించేలా ప్రోగ్రామింగ్ చేశారు. ఆధార్ కార్డులో ఉన్న విధంగానే ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేయాలనే నిబంధన విధించినప్పటికీ ఆధార్‌లో ఇంటిపేరు మొదట ఉండి, ఆన్లైన్ ఫారంలో పేరు తర్వాత ఇంటిపేరు ఇవ్వాల్సి రావడంతో సాఫ్ట్వేర్ ఈ డేటాను మ్యాచ్ చేయడం లేదు. దీంతో అప్లికేషన్ రివైజ్డ్ అవుతుండడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాలకే అత్యధిక ప్రాధాన్యత
ట్రై కార్పొరేషన్ పరిధిలో దాదాపు 89 లక్షల మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు అత్యధికంగా తమ సొంత జిల్లా గ్రామంలోనే ఓటరుగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
శిక్షణ నామమాత్రం
జూన్ 25 నుంచి ప్రారంభమైన సర్ ప్రక్రియ జూలై 24న ముగుస్తుంది. ఈ క్రమంలో సిబ్బందిని నియమించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే ఈ శిక్షణ నామమాత్రంగానే కొనసాగినట్లు తెలుస్తున్నది. దీంతో సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడంతో సర్ ప్రక్రియ ప్రశ్నార్ధకంగా మారింది. దీనికి తోడు చాలా మందికి ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు.