SRDP | బడంగ్‌పేట, సెప్టెంబర్22: బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక విజన్‌తో పనిచేసి ఎంతటి విపత్తునైనా ఎదుర్కోవచ్చునని ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు ద్వారా నిజం చేసింది. గడిచిన కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలో ఎక్కడ కూడా వరద ముప్పు లేకుండా పోయింది. గతంలో చిన్న పాటి వర్షానికి లోతట్టు కాలనీలన్ని జలమయంగా మారేవి. సహాయం చేయడానికి ఎవరు వస్తారని ఎదిరుచూసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు కింద మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్‌పేట, మీర్‌పేట, జల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలలో రూ. 178,45 కోట్లు కేటాయించారు. దాదాపుగా 13,110 మీటర్ల మేరకు ఎస్ఎన్డీపీ నాలాలను ఏర్పాటు చేయడంతో ముంపు కష్టాలకు శాశ్వతంగా పరిష్కారం లభించింది. మహేశ్వరంలో ముంపు సమస్య ఉండకూడదన్న ఉద్దేశంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోయారు. సమస్యను గుర్తించిన కేసీఆర్, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిధులు కేటాయించారు. ఎస్ఎన్డీపీ నిధులతో వరద కాల్వలను ఏర్పాటు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి దశకు వచ్చిన పనులను కొన్ని చోట్ల నిలిపి వేశారు. ఎస్ఎన్డీపీ రెండో దశ పనులను చేయడానికి నిధులు నిలిపివేయడంతో కొన్ని చోట్ల పనులు ఆగిపోగా మరి కొన్ని చోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎస్ఎన్డీపీ ఫేస్ -2 కు నిధులు కేటాయిస్తే భవిష్యత్‌లో కూడా వరద ముంపు ఉండదు.
నాడు వర్షం వస్తుందంటేనే లోతట్టు ప్రాంతాల ప్రజలకు వణుకు పుటేది. కాలనీలన్ని జలదిగ్బంధంలో ఉండేవి. ఇండ్లలో ఉన్న నిత్యావసర సరుకులతో పాటు సర్వం కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేవారు. వర్షం కాలం వచ్చిందంటే ఏ క్షణాన ప్రమాదం వస్తుందోనని భయ భ్రాంతులకు గురి రయ్యేవారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి బాలాజీనగర్, నవయుగ కాలనీ, లక్ష్మీనగర్, మధురానగర్, జయశంకర్ కాలనీ, శివనారాయణ పురం తదితర, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథిలానగర్, సత్యసాయి నగర్, కమలానగర్, ఎంఎల్ఆర్ కాలనీ, ఎస్ఎల్నెస్ కాలనీ, శ్రీధర్ కాలనీలు, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని క్యూబా కాలనీ, షాహిన్ నగర్, తదితర కాలనీలో జలమయంలో ఉండేవి.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎన్డీపీ నిధుల ద్వారా వరద కాల్వలను ఏర్పాటు చేశారు. నాలాల పనులు పూర్తి చేసిన తర్వాత వరద ముంపు తప్పింది. వారం రోజులుగా భారీ వర్షాలు కురిసినా వరద నీరు సాఫీగా పోతుంది. ముంపు సమస్య తీరడంతో కాలనీల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు కాలనీల్లోకి రాకపోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎన్డీపీ పనులు పూర్తి చేయడం కారణంగానే వరద రాలేదని కాలనీ వాసులు అంటున్నారు. మిగిలిన ఎస్ఎన్డీపీ పనులను పూర్తి చేయించాలని కాలనీల ప్రజలు కోరుతున్నారు.
నియోజక వర్గంలో ముంపు సమస్య ఉండకూడదనేది నా కల. వర్షం వస్తుందంటే భయపడేది. ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్, గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోయా. మీర్‌పేట, జల్పల్లి, బడంగ్‌పేట వరద పరిస్థితిని గమనించిన కేసీఆర్ చలించి పోయారు. ఎస్ఎన్డీపీ ద్వారా నిధులు కేటాయించారు. రూ.178 కోట్లతో పనులు చేపట్టాం. పనులు చివరి దశకు వచ్చాయి. కొన్ని చోట్ల పెండింగ్‌లో ఉన్నాయి. అవి పూర్తి చేస్తే మీర్‌పేట, బడంగ్‌పేటకు ముంపు సమస్య ఉండదు. కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు.
– ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి