సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): నగరంలో ఎండలు మళ్లీ మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో వాతావరణం వేసవిని తలపిస్తోంది. జూలై మాసంలో సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 30-32డిగ్రీలు దాటవు. కానీ ప్రస్తుతం వాతావరణంలో నెలకొంటున్న మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.3డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26.2డిగ్రీలు, గాలిలో తేమ 53 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.