మేడ్చల్, డిసెంబర్ 9 : పాఠశాల బస్సుకు ప్రమాదం తప్పింది. సాయంత్రం విద్యార్థులను గమ్యస్థానానికి తీసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూ సుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం…మేడ్చల్ పట్టణంలో ని చాణక్య విజన్ స్కూల్ నుంచి బస్సు విద్యార్థులను దింపడానికి శ్రీరంగవరం దారిలో సోమవారం సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం బయల్దేంది. డ్రైవర్ సత్యనారాయణ గిర్మాపూర్, రాయిలాపూర్‌లో విద్యార్థులను దింపాడు. మిగిలిన 25 మంది విద్యార్థులతో అక్కడి నుంచి బండమాదారం వైపు వెళ్లాడు. గ్రామానికి చేరుకోగానే బస్సు అదు పు తప్పి అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అటుగా వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి భయాందోళనకు గురైన విద్యార్థులను బయటికి తీసుకువచ్చారు. రెగ్యులర్‌గా పనిచేసే డ్రైవర్ రాకపోవడంతో అతడి స్థానంలో సత్యనారాయణ వచ్చాడు. స్టీరింగ్‌లో సమస్య ఉందని, పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని డ్రైవర్ తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సును బయటికి తీశారు. డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి, బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా.. మద్యం తాగిన ఆనవాళ్లు కన్పించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.