Operation Rope | సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): నగర రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీగా రాకపోకలు సాగించేలా నగరంలో అమలు చేసిన ‘రోప్’ మంచి ఫలితాలిస్తున్నది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవడంతో పౌరుల్లో సైతం క్రమశిక్షణ వస్తున్నది. ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటించేలా చేయడంతో పాటు అడ్డదిడ్డం, అక్రమ పార్కింగ్‌లకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతున్నాయి. సిగ్నళ్ల వద్ద వాహనదారులు స్టాప్‌లైన్ ముందు ఆగడం, ఫ్రీ లెఫ్ట్‌లను వదిలేయడం, రోడ్లపై క్యారేజ్ వేలను సాఫీగా ఉంచడంలో అవగాహన పెరుగుతున్నది.
రోప్(రిమూవల్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్) విధానాన్ని ఆరు నెలలుగా నగరంలో కొనసాగిస్తున్నారు. ‘హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆపరేషన్ ‘రోప్’ ను ప్రారంభిస్తూ ట్రాఫిక్ విభాగంతో సామాన్యులకు 100 శాతం సంబంధముంటుందని, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, సాఫీగా ప్రయాణం సాగేలా చర్యలు తీసుకోవడం వల్ల నగర పోలీసు వ్యవస్థకు మంచి పేరు వస్తుందని ట్రాఫిక్ విభాగానికి దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే మొదట్లో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా రోప్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానా విధించారు. ఫుట్‌పాత్‌లు, క్యారేజ్ వేలు ఆక్రమించే వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. రద్దీకి కారణమయ్యే సమస్యలను గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇబ్బందులను గుర్తించి జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, విద్యుత్, వాటర్‌వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ రద్దీకి ఇబ్బంది కలిగించే బస్‌స్టాప్‌లను ఇతర ప్రాంతాలకు మార్చారు.
ఆపరేషన్ రోప్‌తో వాహనదారుల్లో మార్పు వస్తున్నది. 4 ఈ’స్’ (ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎస్టాబ్లిష్మెంట్) పక్కాగా అమలు చేస్తున్నాం. రోడ్లపై అడ్డదిడ్డమైన పార్కింగ్లు తగ్గాయి. పలు కూడళ్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌లు ఏర్పాటు చేశాం. ఫ్రీ లెఫ్ట్, రోడ్డు బ్లాక్ చేయవద్దంటూ వాహనదారులకు అర్థమయ్యే విధంగా బోర్డులు ఏర్పాటు చేశాం. ఎవరైనా ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే జరిమానాలు విధిస్తున్నాం. స్టాప్‌లైన్ దాటినా.. చలాన్లు వేస్తున్నాం. ప్రజల సహకారంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేలా నిరంతరం ప్రయత్నిస్తున్నాం.
-సుధీర్‌బాబు, ట్రాఫిక్ అడిషనల్ సీపీ