గోల్నాక, ఆగస్టు 15 : సామాజిక సేవా కార్యక్రమాల్లో నేటి యువత పాత్ర పలువురికి ఆదర్శనీయమని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం 75వ స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛ కర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబర్పేట క్రౌన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యువసాధికారత కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
కరోనా కష్ట కాలంలో స్వచ్ఛ కర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది కరోనా బాధితులకు భోజనం అందించడం అభినందనీయమన్నారు.
విద్య, ఉపాధి, శిక్షణ, పాలనా రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం యువతను ప్రోత్సహిస్తుందన్నారు. నేటి యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ ముందు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని సాధికారత సాధించాలన్నారు. యువత సమయాన్ని వృథా చేసుకోకుండా భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు తెలిపారు. కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్, స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్ , స్వచ్ఛ కర్మ ప్రతినిధులు పాల్గొన్నారు.