Sports | కుత్బుల్లాపూర్, మార్చి4 : ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన జీవన శైలిలో క్రీడల పాత్ర కీలకమని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మంగళవారం దూలపల్లి సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఖేలో ఇండియా, అందరికీ క్రీడలు, ఉత్తమ క్రీడలు అనే అంశాల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు1000 మంది అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఏటా నిధులు అందించే పాన్-ఇండియన్ స్పోర్ట్స్ స్కాలర్షిప్ అందించారు. క్రీడా విభాగంలో ప్రతిభను గుర్తించడం, అభివృద్ధి, ప్రోత్సహించడం ద్వారా క్రీడా సంస్కృతి అభివృద్ధిలో భాగంగా ‘తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్’తో ‘యోగసన సిటీ లీగ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గ ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆటలు, క్రీడల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆరోగ్యకరమైన జీవితాలను గడపడంలో యోగాసనాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆటలు, క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవితాలను కొనసాగించడానికి విద్యార్థులను ప్రేరేపించారు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు ధ్యానం ఉత్తమ ఔషధమన్నారు. చాలా మంది సెలబ్రిటీలు యోగాసనాలు వేయడం ద్వారా శారీరక ఆరోగ్యం కోసం శ్రద్ధ వహిస్తున్నారని ఆయన అన్నారు. పరుగు, సైక్లింగ్ మరియు ఈతలో క్రమం తప్పకుండా పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని ఆశించారు.
ఈ కార్యక్రమానికి చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. చంద్ర శేఖర్ యాదవ్, ప్రొఫెసర్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పి. సంతోష్ కుమార్ పాత్ర, తమిళనాడు రాష్ట్ర ఇంచార్జి టివైఎస్ఏ అధ్యక్షుడు జి. శ్రీధర్ రావు, యోగాసన భారత్ జాతీయ జాయింట్ సెక్రటరీ నందనం కృపాకర్,700 మంది క్రీడాకారులు హాజరయ్యారు.