సిటీబ్యూరో: కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు నేడు అద్భుత ఫలితాలు ఇస్తున్నది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, విధానాల అమలుతో వ్యర్థాల నుంచి సంపద (వెల్త్ ఆఫ్ వేస్ట్)ను సృష్టించడంలో బల్దియా దూసుకుపోతున్నది. జవహర్‌నగర్ ఫేజ్-1లో 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. ఆగస్టు 2020 నుంచి ఇప్పటి వరకు 17.6 లక్షల టన్నుల చెత్త నుంచి 600 మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి అయ్యింది.
ఆరు కేంద్రాల ద్వారా 101 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా, జవహర్‌నగర్, దుండిగల్ 15 మెగావాట్లు ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి జవహర్‌నగర్ ఫేజ్-2 (24 మెగావాట్ల), ప్యారానగర్(12), యాచారం (12), బీబీనగర్ (11) కేంద్రాలు అందుబాటులోకి రానున్నది. రోజుకు జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు 7760 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలిస్తుండగా, 3768 మెట్రిక్ టన్నుల పొడి చెత్తను వేరే చేసి కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 579 లీచెడ్ వ్యర్థాలు, 1165 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్, 336 మెట్రిక్ టన్నుల సేంద్రియ ఎరువు బయటకు వస్తున్నది.
1600 టన్నుల చెత్తను..
వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేయడంలో బల్దియా మంచి ఫలితాలను రాబడుతున్నది. జవహర్‌నగర్ ప్లాంటు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి 1500-1600 టన్నుల చెత్తను రెండు బాయిలర్లలో వేస్తున్నారు. దాని నుంచి వచ్చే మంటలు నీటిని మరిగించి.. ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది. ఆవిరి ద్వారా టర్బయిన్లు వేగంగా తిరిగి కరెంటు ఉత్పత్తి అవుతుంది. మొదటి ప్లాంటును పూర్తి స్థాయిలో నడిపి 50 శాతం ఉత్పత్తి చేయగా, 65 శాతానికి పెంచారు.
ఆ రెండు ప్లాంట్ల ద్వారా..
చెత్తను జవహర్ నగర్ డంప్ యార్డుకు తరలించే ప్రక్రియను సమగ్ర మున్సిపల్ ఘన పదార్థాల నిర్వహణ ప్రాజెక్టుగా పరిగణిస్తారు. జవహర్‌నగర్ ప్లాంట్ -1, దుండిగల్ ప్లాంట్ ద్వారా ఇప్పటికే 39 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ఫర్ పాయింట్స్ (ఎస్‌సీటీపీ) నుంచి వ్యర్థాలను జవహర్ నగర్ డంప్ యార్డు తరలిస్తారు. తరలించిన వెంటనే అకడ యాంత్రికంగా సెగ్రిగేట్ చేసిన తర్వాత మండే గుణం గల వ్యర్థాలను వేరు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.