Secunderabad | మారేడ్పల్లి, అక్టోబర్ 22: కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం పునరుద్ధరణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 14వ తేదీన దుండగుడు అమ్మవారి ఆలయం పై దాడి చేసి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మరుసటి రోజు నుంచి అమ్మవారి శుద్ధీకరణ, కలశ స్థాపన అనంతరం స్థానికుల ఆధ్వర్యంలో నిత్యపూజలు జరుగుతున్నాయి. దేవాలయ పునర్ నిర్మాణం పై పలువురు దాతలు, రాజకీయ నాయకులు ముందుకు వచ్చారు. అయితే, ప్రభుత్వం ఎట్టకేలకు దేవాలయ పునరుద్ధరణ పనులు దేవాదాయ శాఖ ద్వారా చేయించాలని నిర్ణయించారు. దీంతో మంగళవారం దేవాదాయ అదనపు శాఖ అదనపు కమిషనర్ జ్యోతి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. వేద పండితుల మధ్యన భూమి పూజను నిర్వహించి పనులను ప్రారంభించారు.
అన్ని విధాలా చేయూతనిస్తా..: మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
ముత్యాలమ్మ ఆలయ పునరుద్ధరణ పనుల కోసం తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వేద పండితులతో కలిసి ఆయన అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆయన మాట్లాడి దేవాలయ పున:ప్రతిష్ట కార్యక్రమానికి ముందుంటానని తెలిపారు. అవసరం అయితే హోమాలు, విగ్రహా ప్రతిష్ట, కుంభాభిషేకం నిర్వహిస్తానని వెల్లడించారు. ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించాలని అన్నారు .ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తన చిన్న నాటి నుంచి సికింద్రాబాద్ లో ఇలాంటి పరిస్థితులను చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులకు ముగింపు పలికి ప్రశాంత వాతవారణంలో ప్రజలు జీవించాలని ఆయన కోరుకున్నారు . అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడికి కఠిన శిక్షలు పడాలని, ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని అభివర్ణించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, అత్తెల్లి మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఆకుల హరి కృష్ణ, స్కైలాబ్, నాగులు, రాములు, మహేష్ యాదవ్, సత్యనారాయణ, జయరాజ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఆలయ పునరుద్ధరణకు ప్రభుత్వం పూర్తి సహకారం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
ముత్యాలమ్మ ఆలయం పునరుద్ధరణ కోసం ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ స్పష్టం చేశారు. ఆయన దేవాదాయ శాఖ అధికారులతో కలిసి మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఫౌండర్ ఫ్యామిలీ, బస్తీ వాసుల కోరిక మేరకు అమ్మవారి విగ్రహన్ని పంచలోహాలతో తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. కానీ, కొంత మంది అమ్మవారి ఆలయం వద్ద రాజకీయాలు చేస్తూ, ఫ్యామిలీ సభ్యులు, బస్తీ వాసులను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటి వారిని అమ్మవారే చూసుకుంటుందని తెలిపారు. బస్తీ వాసులు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచచించారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బద్రినాథ్ యాదవ్, శేఖర్ ముదిరాజ్, బల్వంతరెడ్డి, సంకి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.