పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల ప్రాంగణాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజారోగ్యం, ప్రజారక్షణే ముఖ్యమని విద్యాసంస్థల ప్రాంగణాల్లో వీధి కుక్కలను వదిలిపెట్టడంపై ఉన్న ఆంక్షలను ఉన్నత న్యాయ స్థానం సమర్థించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. అయితే ఈ తీర్పులో హైదరాబాద్ శామీర్‌పేట్‌లోని ప్రముఖ నల్సార్ లా యూనివర్సిటీకి మాత్రం సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక మినహాయింపునిచ్చింది. క్యాంపస్ పరిధిలో నియంత్రిత పద్ధతిలో వీధికుక్కల సంరక్షణ కేంద్రాలను నిర్వహించుకునేందుకు ప్రయోగాత్మకంగా అనుమతించింది.
– సిటీబ్యూరో
నల్సార్ వర్సిటీలో ఉన్న యానిమల్ లా సెంటర్ ద్వారా వీధి కుక్కలకు జంతు సంరక్షణ, టీకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని వర్సిటీ వీసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్యాంపస్‌లోనే కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ అందిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని వర్సిటీ కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం నల్సార్ వర్సిటీలో క్యాప్చర్ స్టెరిలైజ్ వ్యాక్సినేట్ రిలీజ్ విధానాన్ని కేవలం ప్రయోగాత్మక ప్రాతిపదికన కొనసాగించాలని అనుమతించింది.
కానీ దీనికి ఒక కఠినమైన షరతును విధించింది. వీధి కుక్కలు ఎవరిపైనా దాడి చేస్తే దానికి వర్సిటీలోని యానిమల్ లా సెంటర్ పూర్తి చట్టపరమైన, నష్టపరిహార బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు వర్సిటీ వైస్ చాన్సలర్‌కు రాతపూర్వకంగా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలను రక్షించడం, వాటిని సాకే హక్కులున్నా… ఇతరుల భద్రతకు భంగం కలిగించేలా ఉండకూడదని, ఎవరైతే కుక్కలను పెంచాలని చూస్తున్నారో, వారి ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వాలని స్పష్టం చేసింది.
నిబంధనలు పాటించాలి..
నల్సార్ ఉదాహరణను అడ్డుపెట్టుకుని దేశంలోని అన్ని విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా స్పష్టమైన నిబంధన తీసుకోచ్చింది. ఆఫిడవిట్ ఇస్తేనే అనుమతి ఇవ్వాలని, భవిష్యత్తులో జరిగే కుక్కల దాడులకు తామే పూర్తి బాధ్యులమని స్పష్టం చేస్తూ ఆయా సం స్థల ఉన్నతాధిపతులు అఫిడవిట్ ఇవ్వాలన్నారు. లేని పక్షంలో క్యాంపస్‌లో వీధి కుక్కలను ఉంచడం కాని, వాటికి ఆహా రం పెట్టడం కానీ పూర్తిగా నిషేధమని, దీనికి ప్రిన్సిపల్స్, వీసీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ప్రజల ప్రాణాలకు హాని లేకుండా, జంతు సంరక్షణకు పూర్తి బాధ్యత తీసుకున్నప్పుడే ఇటువంటి మినహాయింపులు ఉంటాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.