Medchal | మేడ్చల్, ఫిబ్రవరి1(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మిగిలిన 34 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో చేర్చాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లు తెలిసింది. జిల్లాలో గతంలో 62 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 28 వాటిని ఇటీవలే సమీపంలోని మున్సిపాలిటీల్లో ప్రభుత్వం విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న 34 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేసేలా ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు అధికారుల ద్వారా తెలిసింది.
34 గ్రామ పంచాయతీల్లో జిల్లా పంచాయతీ వ్యవస్థను నిర్వహించడం అంతగా సులువుగా ఉండదని అధికారులు అనుకుంటున్నారు. జిల్లా డీపీవో ఇటీవలే బదిలీ అయినా..ఆయన స్థానంలో మరొకరిని నియమించే అవకాశం కనిపించడం లేదని తెలుస్తున్నది. దీంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు జిల్లాలో పని చేసేందుకు అధికారులు మెగ్గు చూపకపోవడంతో పాలన వ్యవస్థ సరిగా సాగలేకపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉన్న 34 గ్రామాలను సైతం మున్సిపాలిటీల్లోచేర్చాలని వివరాలతో ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు.
విలీనాన్ని వ్యతిరేకించినా..
గతంలో 28 గ్రామాలను విలీనం చేసే విధానాన్ని గ్రామ ప్రజలు వ్యతిరేకించినా..ప్రభుత్వం పట్టించుకోకుండా మున్సిపాలిటీలలో విలీనం చేసింది. మిగతా 34 గ్రామాలను కూడామున్సిపాలిటీల్లో విలీనం చేస్తారని ఇప్పటికీ ఉహగానాలు వినిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం లేదు. అయితే త్వరలోనే 34 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే అవకాశం ఉన్నది.