Moosarambagh Bridge | సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) :వర్షాకాలం వచ్చిందంటే చాలు.. మూసీ వరద పోటెత్తడం… మూసారాంబాగ్ పాత బ్రిడ్జి మూసి వేయడం ఆనవాయితీగా వస్తున్నది. గడిచిన కొన్ని రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వానలకు మూసీ ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మూసారాంబాగ్ పాత బ్రిడ్జిని ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. ఫలితంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మలక్‌పేట-అంబర్‌పేట మార్గంలో ప్రయాణం అదనంగా ఐదు కిలోమీటర్ల మేర పెరిగిందని నగరవాసులు మండిపడుతున్నారు.
కొత్తగా చేపడుతున్న హై లెవల్ బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవ కార్యక్రమాన్ని ఎత్తుకొని అప్పటికే కార్యరూపంలో ఉన్న 15 వంతెనలను గాలికి వదిలేసింది. పురోగతిలో ఉన్న పనులనూ పట్టించుకున్న పాపానపోలేదు. ఈ కారణంగానే మూసారాంబాగ్ వద్ద రూ.34 కోట్ల వ్యయంతో చేపట్టిన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు గడిచిన 18 నెలల కాలంలో పట్టుమని 20 శాతం కూడా పూర్తి చేయలేకపోయింది.
ప్రస్తుతం రూ. 8 కోట్ల మేర ఖర్చు చేసి.. మూసీ నదిలో నాలుగు పిల్లర్లు నిర్మించి స్లాబు పనులకే పరిమితం చేశారు. అంబర్‌పేట, మలక్‌పేట వైపు బ్రిడ్జి కోసం 52 ఆస్తులను సేకరించాల్సి ఉండగా, వాటిని ఇచ్చేందుకు యజమానులు అంగీకరించకపోవడంతో ఈ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టును ఇప్పటికే తుది దశకు చేర్చి.. ఈ వానకాలంలోనే మూసీ నదిపై మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బ్రిడ్జిపై రాకపోకలు బంద్
నిరాంతరాయంగా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద పోటెత్తుతున్నది. గడిచిన కొన్ని రోజులు హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తి దిగువ మూసీలోకి వరదను పంపుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం జలమండలి అధికారులు ఏకంగా హిమాయత్‌సాగర్ పది గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తడంతో దిగువ మూసీలోకి 13వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నది. దీంతో జంట జలాశయాల నుంచి మూసీకి నీటిని వదిలినప్పుడు నదిలోని ప్రవాహం మూసారాంబాగ్ వంతెన పైనుంచి వెళ్తున్నది.
పాతకాలం బ్రిడ్జి కావడంతో వరద ఉధృతి పెరిగిన ప్రతిసారీ ట్రాఫిక్ పోలీసులు ఆ మార్గంలో వాహనాలు రాకపోకలను నిలిపివేస్తున్నారు. . ఇప్పట్లో ఈ బ్రిడ్జి తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. నత్తనడకన సాగుతున్న పనులతో అంబర్‌పేట, మలక్‌పేట మధ్య రాకపోకలు సాగించే వాహనదారులలు నిత్యం నరకం చూస్తున్నారు. వాహనదారులు అదనంగా 5 కి.మీ ప్రయాణించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
అటకెక్కించి..చేతులెత్తేసి
మూసీ నదిపై 15 వంతెనల నిర్మాణానికి ప్రణాళికలు జరగగా.. మూడు చోట్ల పనులు మొదలయ్యాయి. అందులో పిర్జాదీగూడలో హెచ్ఆర్డీసీఎల్ పనులను అర్థాంతరంగా నిలిపివేసింది. ..మిగిలిన ఒక్క పనిని కూడా జీహెచ్ఎంసీ సకాలంలో పూర్తి చేయలేకపోయింది. సన్ సిటీ నుంచి చింతల్మెట్ వరకు రూ. 32 కోట్లతో లింకు రోడ్డు నిర్మాణంతో పాటు మూసీ నదిపై 4 లేన్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంది.
కానీ మూడు పిల్లర్లతో ఫౌండేషన్ స్థాయిలో పనులు నిలిచిపోయాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వాహనాలు లంగర్‌హౌజ్ బాపుఘాట్ బ్రిడ్జి మీదుగా సన్‌సిటీ వైపు, నార్సింగి వైపునకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల 4-5 కిలోమీటర్ల మేర ప్రయాణ దూరం తగ్గే అవకాశం ఉండేది. కొత్తగా ఆయా ప్రాంతాల్లో ప్రతిపాదించిన వంతెనల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, అందుబాటులోకి తెస్తే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల నుంచి, ఎక్కువ దూరం నుంచి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాత మలక్‌పేట డివిజన్ పరిధిలోని శంకర్‌నగర్, పద్మానగర్, వినాయక వీధి, చాదర్‌ఘాట్, మూసానగర్ తదితర లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పలువురు బాధితులను బల్దియా అధికారులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలోకి తరలించి తగిన ఏర్పాట్లు చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.