SPDCL | సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. దసరా పండుగకు ముందు, ఈనెల 7 తర్వాతే పూర్తి చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అధికారులు వారం రోజులు గడిచినా బదిలీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు మొట్ట మొదటిసారిగా వెబ్ కౌన్సెలింగ్ తరహాలో బదిలీలకు సంబంధించి జాబితా రూపొందించింది. ఎంతో కాలంగా బదిలీల కోసం ఎదురు చూస్తున్నామంటూ ఉద్యోగులు వాపోతున్నారు.
7వ తేదీ నాటికి ఎంప్లాయీస్ పోర్టల్ ద్వారా ఆప్షన్స్ స్వీకరించిన డిస్కం ఉన్నతాధికారులు, గడువు ముగిసిన వెంటనే బదిలీ జాబితాను వెబ్ కౌన్సెలింగ్ గడువు పూర్తయిన వెంటనే ఆటో రన్ నిర్వహించి జాబితాను ప్రకటించాల్సి ఉంది. అయినా ఈ విషయంలో స్పష్టత లేదు. ఎంతో పారదర్శకంగా చేస్తున్నామని చెప్పిన డిస్కం ఉన్నతాధికారులు, మార్గదర్శకాలు, గడవు విషయాలను పట్టించుకోకుండా బదిలీల జాబితా విడుదల చేయడంలో తాత్సారం చేస్తుండటంతో ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఉద్యోగుల బదిలీలు ఇలా…
డివిజినల్ ఇంజినీర్లు(డీఈ)-111
అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్లు – 263
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు – 521
ఇతర కేడర్ ఉద్యోగులు – 231