మన్సూరాబాద్, జూలై 31:ఆలయాల భూముల విషయంలో ఇనాందార్ అనుభవదారుడి కాలం పహానీలో లేకపోవడంతో వివిధ గ్రామాల్లోకి వంశ పారంపర్య అర్చకులు లబ్ధి పొందలేక పోతున్నారని చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు, సంఘం గౌరవ అధ్యక్షుడు రంగరాజన్ తెలిపారు. తెలంగాణ ఇనాందారుల వంశపారంపర్య అర్చక సమా ఖ్య సమావేశంలో బుధవారం ఎల్బీనగర్, చంద్రపురికాలనీలో శ్రీవైష్ణవ సేవా సంఘం కార్యాలయంలో నిర్వహించారు.
రాష్ట్రంలోని అర్చకుల హక్కులు, ఇనాం భూముల సంరక్షణ, పలు సమస్యల పరిష్కారానికి నూతన అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. రంగరాజన్ మాట్లాడుతూ..అర్చకుల పోరాటాలతో 2007లో నాటి సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం 30/87 జీఓను 33/2007గా సవరించిందన్నారు. చట్టాన్ని సవరించి 17 ఏండ్లు కావస్తున్నా అధికారులు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.
ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉందని, అదేవిధంగా శాసనసభ తీర్మానం ఉన్నప్పటికీ అధికారులు అమలు చేయకపోవడం తెలంగాణ ఇనాందారుల అర్చక సమాఖ్యను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం సవరించిన చట్టాన్ని ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఇనాందారుల వంశపారం పర్య అర్చక సమాఖ్య ఎదుర్కొంటున్న సమస్యను త్వరలో సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో అర్చక సమాఖ్య అధ్యక్షుడు, యాదగిరిగుట్ట రిటైర్డ్ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, ప్రధానకార్యదర్శి కృష్ణయ్య, ఉపాధ్యక్షులు వి.రామానుజచారి, శ్రీవైష్ణవ సేవా సంఘం తెలంగాణ అధ్యక్షుడు ఎస్టీ చారి తదితరులు పాల్గొన్నారు.