అమీర్‌పేట్, జూలై 13: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో అన్ని రంగాలు పురోగమిస్తున్నాయని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అనేక వ్యాపారాలతో ముడిపడి ఉన్న ఈవెంట్స్ ఇండస్ట్రీ కూడా అన్ని విధాలుగా ముందడుగు వేస్తుండటం సంతోషకరమన్నారు. ఈవెంట్స్ నిర్వాహకులు జరిపే వేడుకలు విశాలమైన పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించారు. పర్యాటకులను ఆకర్షించే విశాలమైన అనేక ప్రదేశాలు తెలంగాణలోని నలుమూలల్లో ఉన్నాయని, వీటిని తమ వేడుకలకు ఉపయోగిస్తే అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని తెలిపారు.
తెలంగాణ పర్యాటక శాఖ సహకారంతో ఈ నెల 24, 25వ తేదీలలో హైటెక్స్‌లో ప్రతిష్ఠాత్మక టీసీఈఐ, ఎస్ఐడబ్ల్యుపీసీ గ్లోబల్ 2023 సదస్సు జరుగనుంది. రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిగే ఈ సదస్సులో టీసీఈఐ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం జరుగుతుందని వేడుకల నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు బేగంపేట్‌లోని హోటల్ హరిత ప్లాజాలో టీసీఈఐ అధ్యక్షులు బలరామ్ బాబు ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీసీఈఐ అధ్యక్షులు బలరామ్ బాబు మాట్లాడుతూ సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి 450 మందికి పైగా వెడ్డింగ్ ప్లానర్లు హాజరవుతారని తెలిపారు.
ఈ సదస్సు ద్వారా రంగంపై మరింత అవగాహన, పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు వీలవుతున్నదన్నారు. ఎడ్గార్డో జమేరా, బార్సిలోనా, టెడ్డీ మాన్యుయేల్, నాడియా డ్యూరాన్, జోసెఫ్ రాడిక్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వెడ్డింగ్ ప్లానర్లు ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ముఖ్య కార్యరద్శి సందీప్ సుల్తానియా, టీసీఈఐ కార్యదర్శి రవి బూర, ఎస్ఐడబ్ల్యుపీసీ కన్వీనర్ శ్రవణ్ మాదిరాజు, టీసీఈఐ ఈవెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కమిటీ కన్వీనర్ రమేష్ ముప్పన, కో-కన్వీనర్ డాక్టర్ సౌరభ్ సురేఖ, కోశాధికారి తౌఫిఖ్ ఎం.ఖాన్, సంయుక్త కార్యరద్శి ఫర్హా ఖుదారీ పాల్గొన్నారు.