సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/బడంగ్పేట్/ముషీరాబాద్/మారేడ్‌పల్లి/ఎల్బీనగర్ / మన్సూరాబాద్/వనస్థలిపురం/ : హయత్‌నగర్ కాంగ్రెస్ సరారు అనుసరిస్తున్న విధానాలు సామాన్య భూ యజమానుల పాలిట శాపంగా మారుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని వేలాది సర్వే నెంబర్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, నిశ్శబ్దంగా 22ఏలో చేర్చిన ప్రభుత్వం, ఆ తర్వాత వాటికి మోక్షం కల్పించే విషయంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో చెమటోడ్చి కూడబెట్టుకున్న ఆస్తులను అవసరమైనప్పుడు అమ్ముకోలేక, కొనుకోలేక సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. ‘అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి’ అన్న సామెతను తలపించేలా పరిస్థితి తయారైందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఘటేసర్ మండలం యాంనాంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 133లో హెచ్ఎండీఏ అనుమతులతో ఓ డెవలపర్ 2021లో వెంచర్ ప్రారంభించాడు. నిబంధనలన్నీ పాటించి, అనుమతులు తీసుకొని చేపట్టిన ఈ వెంచర్లో ప్లాట్లన్నీ విక్రయమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ యథావిధిగా క్రయవిక్రయాలు సాగుతూ వచ్చాయి. అయితే మూడు నెలల క్రితం ఈ సర్వే నెంబర్ మొత్తాన్ని ప్రభుత్వం హఠాత్తుగా నిషేధిత జాబితాలో చేర్చడంతో పరిస్థితి తలకిందులైంది. ఒప్పంద గడువు దగ్గరపడుతున్నా రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో, ప్లాట్ల కొనుగోలుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. డబ్బులు వెనకి ఇవ్వాలని లేదా రిజిస్ట్రేషన్ చేయించాలని యజమానులపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై డెవలపర్లు, యజమానులు మండిపడుతున్నారు.
తమ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించుకునేందుకు యజమానులు అధికారుల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం దకడం లేదు. ఒక దశలో సమస్య పరిషారం కోసం చేసే ప్రయత్నాలే మరిన్ని కొత్త చికులకు దారితీస్తున్నాయని, ఇది సరిగ్గా కొరివితో తల గోకున్నట్లుగా తయారైందని బాధితులు వాపోతున్నారు. అనుమతులతో నిర్మించిన వెంచర్లు, ఏళ్ల తరబడి క్రమం తప్పకుండా జరుగుతున్న క్రయవిక్రయాలకు ప్రభుత్వం ఏకపక్షంగా, ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం ఏ మేరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు వందల్లో ఉన్నాయని, నిషేధిత జాబితా వల్ల వేలాది కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురొంటున్నాయని బాధితులు చెబుతున్నారు. జాబితాలో చేర్చే ముందు పరిశీలన ఎంత వేగంగా జరిగిందో, జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కూడా అంతే వేగంగా, పారదర్శకంగా జరగాలని, లేనిపక్షంలో సామాన్యుల ఆస్తుల భద్రతపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉప్పల్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌ను ఇటీవల ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ నేపథ్యంలో ఓ ఫ్లాట్ యజమాని తన ఫ్లాట్‌ను అమ్మకానికి పెట్టగా, పరిస్థితిని అదునుగా చేసుకున్న ఓ కొనుగోలుదారుడు, ‘రెవెన్యూ పనులన్నీ మేమే చూసుకుంటాం, మారెట్ ధర కన్నా 30 శాతం తకువ రేటుకు ప్లాటు ఇవ్వు’ అంటూ బేరసారాలకు దిగాడు. సరారు నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటూ, ఇబ్బందుల్లో ఉన్న యజమానులను నిలువునా దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. చేతికాడి ముద్దను ఎవరో లాకున్నట్లుగా, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జాబితా సామాన్యుల పాలిట పెనుభూతంగా మారి పట్టిపీడిస్తోంది.
మేడ్చల్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): 22ఏ నిషేధిత జాబితా రియల్ మార్కెట్‌ను మరింత దిగాజార్చింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రియల్ రంగం మరింత కుదేలు కానుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చినందున ఇప్పట్లో రియల్ రంగం కోలుకునేలా కనింపించడం లేదని ప్రజల్లో చర్చ సాగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రియల్ రంగం పరుగులు తీయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మందకొడిగా మారి అనేక మంది ఉపాధి కోల్పోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగా జిల్లా శివారు ప్రాంతాల్లో రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రియల్ రంగం పరుగులు తీసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రియల్ రంగం పరిస్థితి తారుమారైంది. దీనికి తోడగా 22ఏ నిషేధిత జాబితాతో ప్రజల ఆస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం సంకేళ్లు వేసినట్లయింది. ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లలోని ప్లాట్లు, శివారు ప్రాంతాల్లో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు మరుగున పడ్డాయి. ప్రస్తుతం మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో 19,461 ఇండ్లు నిషేధిత జాబితాలో చేర్చినందున అ ప్రాంతాల్లో క్రయ విక్రయాలకు ఇబ్బందికర పరిస్థితి ఉంది. అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నవారి పరిస్థితి కడుదయనీయంగా మారింది. దీనికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రైవేట్ ఆస్తుల యజమానులు శాపనార్థాలు పెడుతున్నారు. దీంతో జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్దకు ఇప్పటికీ ప్రతి రోజు ప్రైవేట్ ఆస్తుల యజమానులు క్యూ కడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకుంటున్నారు. ప్రైవేట్ యజమానుల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భరోసా ఇస్తున్నారు.
సర్వే నెంబర్ల ఆధారంగా 22ఏ జాబితా కింద మొత్తం భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదు. కాలనీలో ఉండే ఒకే సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి, పట్టా భూమి ఉంటుంది. కాలనీలో ఉండే ప్రభుత్వ భూమిని నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ ప్రస్తుతం జరిగింది వేరు. కాలనీలో ఉండే ప్రభుత్వ భూమిని, పట్టా భూమిని కలిపి సర్వే నెంబర్ ఆధారంగా మొత్తానికి మొత్తం నిషేధిత జాబితాలో చేర్చారు. దీని వల్ల ప్రస్తుతం ఇండ్లు కట్టుకుని ఉన్నవారితోపాటు, ఖాళీ ప్లాట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టా భూములను నిషేధిత 22 జాబితా నుంచి తొలగించే విధంగా ప్రభుత్వ యంత్రాగం చర్యలు చేపట్టాలి. ఇప్పటికే కొందరు కోర్టులకు వెళ్లారు. కానీ కోర్టు నుంచి పరిష్కారం లభించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. భూముల విషయంలో పారదర్శకంగా మరోసారి సర్వే చేపట్టి పట్టా భూములను 22ఏ నుంచి తొలగించాలి.
– రాంశెట్టి హన్మంతరావు, రిటైర్డ్ తహసీల్దార్
మహెంద్రాహిల్స్లో 22ఏ వల్ల ఎంతోమంది కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు త్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా మహెంద్రాహిల్స్లో సర్వే నిర్వహించి 22ఏలో ఉన్న భూములపై వాస్తవ పరిస్థితిని తేల్చాలి. అర్హత ఉన్న ప్రైవేటు ఆస్తులను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలి. అర్హత ఉన్న ప్రైవేటు ఆస్తులకు రిజిస్ట్రేషన్‌కు మార్గం సుగమం చేయాలి.
– కేఆర్కే, మూర్తి , సీనియర్ సిటిజన్, త్రిమూర్తి కాలనీ వాసి
మారేడ్‌పల్లి మండల రెవెన్యూ పరిధిలోని మహెంద్రాహిల్స్లో ప్రభుత్వ భూమి ఏదో, ప్రైవేటు భూమి ఏదో స్పష్టంగా చెప్పాలి. సర్వే నంబర్ 74పై కాలనీవాసులు, ప్రభుత్వం మధ్య కోర్టులో కొంతకాలం కేసు కొనసాగింది. కోర్టు తీర్పు కాలనీవాసులకు అనుగుణంగా వచ్చింది. అప్పటి నుంచి కోర్టు ఆర్డర్ కాఫీ సహాయంతో 74 సర్వే నంబర్లో ఇండ్లను నిర్మించుకున్నాం. అయితే ప్రస్తుతం 22ఏ వల్ల ఇండ్ల నిర్మాణాలు, ప్లాట్స్, ఇండ్ల క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. అర్హత ఉన్న ప్రైవేట్ ఆస్తులను జాబితా నుంచి తొలగించే ప్రక్రియ వేగవంతగా చేయాలి.
– నర్సింగ్‌రావు, మహెంద్రహిల్స్
ఇన్నేళ్ల తర్వాత నిషేధిత జాబితా అంటే ఎలా? ఎప్పటినుంచో నివాసముంటున్న తమ బస్తీలను నిషేధిత జాబితాలో చేర్చడం శోచనీయం. ఇంతకాలం తరువాత ఇప్పుడే ప్రభుత్వానికి ఎందుకు గుర్తుకు వచ్చిందో ఆర్థం కావడం లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కావడంలేవు. మున్సిపల్ అధికారులు నిర్మాణ అనుమతులు ఇవ్వడం లేదు. ఆస్తి పన్ను మాత్రం కట్టించుకున్నారు. 60, 70 ఏళ్లుగా నివాసముంటున్న మా బస్తీలను నిషేధిత జాబితాలో చేర్చడం ప్రభుత్వ ఆనాలోచిత విధానానికి నిదర్శనం.
-కాడబోయిన నర్సింగ్‌ప్రసాద్, ముషీరాబాద్
నిషేధిత జాబితా పేదల పాలిట శాపంగా మారింది. 70ఏళ్లుగా నివాసముంటున్న గృహసముదాయాలను నిషేధిత జాబితాల్లో చేర్చితే పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కడికి పోవాలి. ఇదంతా బ్రోకర్లకు లబ్ది చేకుర్చేలా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుట్ర చేసి 22ఏ తీసుకొచ్చారు. దీనిని వెంటనే సవరించాలి.
-వి.సుధాకర్ గుప్తా, రాంనగర్
సుమారు 70ఏళ్ల క్రితం బండ్లగూడలోని సర్వే నెం. 36/2, 36/3, 36/4, 36/5లో నాటి ప్రభుత్వం నలుగురు ఫ్రీడం ఫైటర్లకు ఒక్కొక్కరికి 10 ఎకరాల చొప్పుల 40 ఎకరాల 4 గుంటల స్థలాన్ని కేటాయించింది. ఈ భూమిని 10ఏళ్ల తర్వాత అమ్ముకునే హక్కును ప్రభుత్వాలే కల్పించాయి. సదరు జీవోల ఆధారంగా 1965వ సంవత్సరం సమయంలో ఫ్రీడం ఫైటర్లు తమకు కేటాయించిన భూములను ఇతరులకు అమ్ముకున్నారు. అనంతరం 1967లో లే అవుట్ చేసి ప్లాట్లను అమ్మారు. సదరు ప్లాట్లు ఇప్పటికే పది మంది చేతులు మారాయి. సర్వే నెం.36/2, 36/3, 36/4, 36/5లో ప్రస్తుతం కృషినగర్, బండ్లగూడ, అజయ్‌నగర్ కాలనీలు ఏర్పడ్డాయి. 90 శాతం మేర ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కృషినగర్, బండ్లగూడ, అజయ్‌నగర్ కాలనీలకు చెందిన 40 ఎకరాల 4 గుంటల భూమిని నిషేధిత జాబితాలో చేర్చింది. తప్పు ఎవరు చేశారు.. శిక్ష ఎవరికి వేస్తున్నారో అర్థం కావడం లేదు. బడుగు, బలహీనవర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. వెంటనే ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకుని ఫ్రీడం ఫైటర్లకు ఇచ్చిన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలి.
– చెలిమండ్ల ప్రతాప్, కృషినగర్ కాలనీ అధ్యక్షుడు
118 జీవోతో బాధితులంతా సంతోషంతో ఉన్న సమయంలో అంతకంటే మంచి ప్రణాళికతో శాశ్వత పరిష్కారం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు మిగిలిన వారు 22ఏ బాధితులుగా మారారు. మమల్ని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టివేశారు. అందరూ పేద, మధ్య తరగతి వర్గాలకు చెందివారే ఇక్కడున్నారు. సుమారు 600 మందికి కన్వీనియన్స్ డీడ్లు రావాల్సి ఉంది. ప్రభుత్వం మాపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. సమస్య తీరిందనుకున్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురవడం మంచి పరిణామం కాదు. ప్రభుత్వం పునరాలోచించి నిషేధం ఎత్తివేయాలి.
– ఆర్. ముత్యం రావు, శ్రీపురం కాలనీ అధ్యక్షుడు
ప్రభుత్వ భూములు ఏవో.. పట్టా భూము లు ఏవో సరైన సర్వే జరపకుండానే రెవె న్యూ అధికారులు ఆదరబాదరాగా జాబితాను సిద్ధం చేసినట్లు కనిపిస్తుంది. రాక్‌టౌన్ కాలనీ ఏర్పడి సుమారు 50ఏళ్లకు పై బడింది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉండే రాక్‌టౌన్‌కాలనీలో 565 ప్లాట్లు ఉన్నాయి. 90 శాతం మంది ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. కాలనీలో ఏదైనా ప్రభుత్వం భూమి ఉంటే 22ఏ కింద నిషేధంలో పెడితే అభ్యంతరం లేదు. కానీ కాలనీ మొత్తాన్ని ఆ జాబితాలో చేర్చారు. దీంతో మేము ఉంటున్న ఇండ్లు, కొన్న జాగలు మావి కాకుండా పోతున్నాయి.
– పాల్వాయి రాంరెడ్డి, రాక్‌టౌన్‌కాలనీ మాజీ అధ్యక్షుడు
22ఏ నిషేధిత జాబితాలో కాలనీలు ఉండడంతో బ్యాంకు లోన్లు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజలకు పెనుశాపంగా మారింది. బీఆర్ఎస్ పాలనలో స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రత్యేక జీవో 118ను తీసుకొచ్చి ప్రత్యేక రిజిస్ట్రేషన్లు చేయించారు. ప్రభుత్వం మారడంతో మరికొంతమంది రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కాలనీలను 22ఏ నిషేధిత జాబితా నుండి తొలగించాలి.
– బత్తుల మహేశ్‌గౌడ్, పద్మావతికాలనీ అధ్యక్షుడు, హయత్‌నగర్
మీర్పేట్ పరిధిలోని చింతల కుంట కాలనీ ప్రజలు 40ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్లు కూడా ఉన్నాయి. మున్సిపల్ నుంచి డోర్ నెంబర్లు, వాటర్ బిల్లులు, కరెంటు బిలులు చెల్లిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సడెన్‌గా 22ఏ నిషేధిత జబితాలో మా బస్తీని పెట్టడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అంతా గందరగోళంగా మారింది. ఇప్పటికే స్థానికులతో కలిసి కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశాం.
– చవ్వ శ్రవన్ కుమార్
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నది. ప్రైవేట్ భూముల్లో ఉన్న ఇండ్లు, పాట్లను క్రయ విక్రయాలు జరగకుండా 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడంతో అదే చర్చ అవుతుంది. ఇక హామీలను ఎవరూ అడుగరు. నెలల తరబడి ఈ సమస్యతో కాలం వెలదీసే అవకాశం ఉంటుంది. మీర్పేట్ నందిహిల్స్ కాలనీ, టీచర్ కాలనీ, ప్రశాంత్ హిల్స్ కాలనీలను నిషేధిత జాబితాలో పెట్టారు. దీంతో ప్రజలు హామీల గురించి మర్చిపోతారని ప్రభుత్వం ప్లాన్.
– నర్సిరెడ్డి, నందిహిల్స్
రేవంత్‌రెడ్డి సర్కార్ కోటికిపైగా ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చేలగాటమాడుతున్నది. 22ఏ ముసుగులో ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపింది. కావాలనే ప్రజలను తిప్పలు పెడుతున్నారు. దరఖాస్తుల పేరిట ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు. ప్రజల కష్టార్జిత భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి.
– పెండ్యాల నగేష్, చిత్ర లేఅవుట్ కాలనీ అధ్యక్షుడు
మాది ఆర్కేపురం డివిజన్ హరిపురి కాలనీ. మా కాలనీని 1964-65లో లేఅవుట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఇండ్లు, అపార్ట్మెంట్స్ అయ్యా యి. సుమారు 5వేల మంది నివసిస్తున్నారు. సడన్‌గా ఇప్పుడు మా కాలనీలోని కొంత భాగాన్ని 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా అవసరం నిమిత్తం తమ భూమిని అమ్ముకునే హక్కులేదంటున్నారు. మాకు ఎలాంటి లోన్లు రావడం లేదు. మాకు అనీ అనుమతులు ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని అడిగితే అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదు. మాకు న్యాయం చెయ్యాలి.
– పెద్ది శ్రీనివాసులు, హరిపురి కాలనీ అధ్యక్షుడు