భువనేశ్వర్, సెప్టెంబర్ 15 : కడు బీదరికం, వసతుల లేమితో ఎన్నో కష్టాలు పడ్డా.. మొక్కవోని కృషి, పట్టుదలతో ఒక నిరుపేద ఆదివాసీ రైతు కుటుంబంలో పుట్టిన ఐదుగురు అన్నాచెల్లెళ్లు నీట్లో ఉత్తీర్ణులై మెడిసిన్లో సీటు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లా సికాబడి గ్రామానికి చెందిన బృషినాయక్, అనుశాయ దంపతులది నిరుపేద కుటుంబం. నిరక్షరాస్యుడైన బృషి నాయక్ ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ, కొన్నిసార్లు ఇతర రాష్ర్టాల్లో వలస కూలీగా వెళ్లేవాడు. ఆయన కుమారుడు బిబీశన్ బాగా చదువుకుని నీట్లో సీట్ సంపాదించాడు. కోరాపూట్లోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేసి, ప్రస్తుతం అక్కడే ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. బిబీశన్ స్ఫూర్తితో అతడి పెద్ద చెల్లెలు మోనాలిసా కూడా మెడిసిన్ సీటు పొంది అదే కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నది.
ఆ తర్వాత మరో ముగ్గురు చెల్లెళ్లు సునేమీ, ఆశ్రియా, మీనాక్షి కూడా ఈ ఏడాది నీట్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వం రంగ వైద్య కళాశాలలో ప్రవేశం పొందారు. ఇందులో మీనాక్షి.. బృషి తమ్ముడు జిశియా కుమార్తె. కొన్ని కారణాల వల్ల చిన్నతనం నుంచి ఆమెను బృషి దంపతులే పెంచుతున్నారు. ఇంట్లో మొత్తం 9 మంది ఉంటామని, మరో ఇద్దరు కుమారులు స్కూల్లో చదువుతున్నారని తల్లి అనుశాయ తెలిపారు. తమ పిల్లల చదువుల కోసం ఇప్పటికే కొంత రుణం తీసుకున్నామని, అయితే వైద్య విద్య చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో ప్రభుత్వం తమకు సహాయం అందించాలని బృషి నాయక్ విజ్ఞప్తి చేశారు.