అడ్డగుట్ట, ఫిబ్రవరి 20 : మద్యం మత్తులో ఓ మహిళతో అకారణంగా గొడవ పడటమే కాకుండా.. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మెట్టుగూడ హమాలీబస్తీకి చెందిన ఉప్పరి రఘు(34) ప్రైవేట్ ఉద్యోగి. అదే ప్రాంత నివాసి అయిన ఓ మహిళతో మద్యం మత్తులో గొడవ పడ్డాడు. దీంతో ఆమె డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే చిలకలగూడ కానిస్టేబుల్ సుధీర్, ఇతర సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి ఆమె నుంచి వివరాలు సేకరించారు.
ఆ తర్వాత రఘును పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న అతడు పోలీసులను అసభ్యపదజాలంతో దూషించాడు. అంతేకాకుండా.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో కాలు, చేతికి గాయాలయ్యాయి. వెంటనే చిలకలగూడ పోలీసులు రఘును అదుపులోకి తీసుకొని, అతడిపై కేసు నమోదు చేశారు. మంగళవారం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.