శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 19: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి మరణించగా, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ఈ ఘటన వివరాలను శంషాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ ఎస్ఐ నర్సింహారావు తెలిపారు. కర్నూల్ పట్టణానికి చెందిన మాలతి (55), ఆమె కూతురు మౌళికతో సహా ఐదుగురు ఓ కారులో పెద్ద అంబర్‌పేట నుంచి గచ్చిబౌలికి వెళ్తున్నారు. శంషాబాద్ సమీపంలోని ఔటర్‌రింగ్ రోడ్డుపై ఓ లారీ పార్కింగ్ చేసి ఉంది. వేగంగా వెళ్తున్న కారు.. పార్కింగ్ చేసి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మాలతి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె కూతురు మౌళిక తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంలో కారు దెబ్బతిన్నది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.