ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 7: ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, దానిని తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ అధ్యాపకులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ కళాశాల ఎదుట అధ్యాపకులు చేస్తున్న నిరసనలు శుక్రవారంతో 140వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ నాలుగున్నర నెలలకు పైగా ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు నిరసన తెలుపుతున్నా కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సెప్టెంబర్‌లో వర్సిటీలో జరిగిన సీఏఎస్ ప్రమోషన్లలో 47 మంది అధ్యాపకులకు ప్రమోషన్లు నిరాకరించారని చెప్పారు. పైకి ప్రతిభ ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చామని ఓయూ అధికారులు చెబుతున్నప్పటికీ, కొందరి పట్ల అశ్రితపక్షపాతం, మరికొందరి పట్ల కక్ష సాధింపు అనే కొలమానాన్ని ఓయూ వీసీ అమలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉత్తమ అధ్యాపక అవార్డు, ఉత్తమ రీసెర్చ్ అవార్డు పొందిన వారికి సైతం ప్రమోషన్లు నిరాకరించారని వివరించారు. కానీ ఎలాంటి పనితీరు లేని కొంతమంది అధ్యాపకులకు మాత్రం ప్రమోషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
రిజెక్ట్ చేసిన వారిలో అర్హతలున్న ప్రతి అధ్యాపకుడికీ ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లలో తమకు అన్యాయం జరిగిందని తమ తరపున మాట్లాడుతున్న ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్‌ను అకారణంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. తక్షణమే ఆయన సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రొఫెసర్ రాంచందర్, ప్రొఫెసర్ కమలాకర్, ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ వెంకటదాస్, డాక్టర్ రామకృష్ణగౌడ్, డాక్టర్ రమేశ్, డాక్టర్ అరవింద్, డాక్టర్ సుజాత, డాక్టర్ మాధురి తదితరులు పాల్గొన్నారు.