గ్రేటర్లో వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం మహానగరంలో జనాభా సుమారు 1.4కోట్లు ఉంటే.. వాహనాల సంఖ్య కోటికి చేరింది. వీటికి తోడు నిత్యం బయటి నుంచి నగరానికి 30వేల వరకు వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. నగరంలో ప్రతిరోజు 1500 నుంచి 2వేల వరకు కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నట్లు ఆర్టీఏ లెక్కలు చెబుతున్నాయి. అంటే సగటున ఒక్కో మనిషికి ఒక్కో వాహనం చొప్పున తిరుగుతున్నాయి.
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలోని దాదాపు 900 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారుల నెట్వర్క్ ఈ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఒక్కో కిలోమీటర్‌కు నగరంలోని ప్రధాన రోడ్లపై 9,500 కంటే ఎక్కువ వాహనాలు ఉంటున్నాయి. అయితే బీఆర్ఎస్ హయంలో క్షేత్రస్థాయిలో సాంకేతిక పరిజానాన్ని ఉపయోగిస్తూ వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేవారు. మూడేండ్ల క్రితం ఒక కిలోమీటర్‌కు 6,500 వాహనాలు ఉంటే, నేడు అది 9,500కు పెరిగింది.
అప్పటి పరిస్థితులకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్డు కనెక్టివిటీని పెంచి, ఫ్లైఓవర్లు, మెరుగైన ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థతో వాహనదారులకు అంతగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యేదికాదు. దీంతో వాహనదారుడు ఇంటినుంచి వెళ్లడం, కార్యాలయం నుంచి ఇంటికి చేరడానికి 10 నిమిషాలు అటూ ఇటు అనుకున్న సమయానికి చేరుకునేవాడు. కానీ నేడు వాహనదారుడు అనుకున్న సమయానికి తమ గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి. గతంలో గంట సేపట్లో తమ గమ్యాన్ని చేరుకునే వాహనదారుడికి.. నేడు 2 గంటల సమయం పడుతోంది. అంటే గంట సేపు ట్రాఫిక్‌లోనే చిక్కుకొని విలవిలాడుతున్నాడు. తక్కువ కాలుష్యాన్ని వెదజల్లె వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపైకి వచ్చినా వాయి కాలుష్యం మాత్రం పెరుగుతూనే ఉంది. పలుమార్లు నగరంలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 160 నుంచి 170 వరకు పెరగడం ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.
గతంలో నగరంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటే అందులో ఒకటి, రెండు కుటుంబాలు నివాసముండేవి. నేడు ఆయా ఇండిపెండెంట్ హౌస్‌ల స్థానంలో అపార్టుమెంట్లు వెలుస్తున్నాయి. దీంతో ఒకటి రెండు కుటుంబాలు నివాసముండే అదే స్థలంలో (అపార్ట్మెంట్లలో) పదుల సంఖ్యలో కుటుంబాలు నివాసముంటున్నాయి. దీనికితోడు ట్రాఫిక్ అంచనాలు లేకుండా కొత్త అపార్టుమెంట్లకు అంతస్థులు నిర్మించుకోవడానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులిస్తున్నాయి.
ఇలా ఒక హైరేంజ్ బిల్డింగ్ కొత్తది నిర్మాణమయ్యిందంటే అందులో వందల సంఖ్యలో కొత్త కుటుంబాలు, వందల సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. అయితే వారికి తగ్గట్లు రోడ్ల వెడల్పు జరగడం లేదు. అలాగే ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుండటంతో చాలామంది వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మెట్రో రైల్ మార్గంలో గతంలో ట్రాఫిక్ తగ్గినప్పటికీ.. రద్దీ పెరగడం, ఛార్జీలు పెంచడంతో చాలామంది తిరిగి తమ వ్యక్తిగత వాహనాలతోనే కార్యాలయాలకు, పనులకు వెళ్తున్నారు. ఇలా గ్రేటర్లో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేయకపోవడంతో నగర జీవులకు ట్రాఫిక్ ఒక శాపంగా మారింది.
నగరజీవి జేబుకు చిల్లు..!
గతంలో హైదరాబాద్‌లోని ప్రధాన మార్గాలు, కేంద్రాల్లోనే ట్రాఫిక్ రద్దీ ఉండేది. అయితే ఇప్పుడు ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఎటుచూసినా ట్రాఫిక్ రద్దీ కనపడుతోంది. కాలనీలు, బస్తీలలో ఎటు చూసినా వాహనాల పార్కింగ్ కన్పిస్తోంది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీగా ఉంటే ప్రత్యామ్నాయాలు కోసం వెతికినా ప్రయోజనం లేకుండా పోతుంది. ట్రై పోలీస్ కమిషనరేట్లలోని పలు ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో 50 కిలోమీటర్ల్ల ప్రయాణానికి ఒక లీటర్ పెట్రోల్‌ను వెచ్చిస్తే… నేడు లీటర్న్నరకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కారులో ప్రయాణించే వారికి పెట్రోల్, డీజిల్ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. బస్‌పాస్ కూడా గతంలో 1000 రూపాయలుంటే ఇప్పుడు అది 1500కు పెరిగింది.
ఒక పక్క గుంతలమయంగా ఉన్న రోడ్లు, మరోపక్క గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కొని ఉంటున్న సగటు నగరవాసి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. రెండేండ్ల క్రితం వరకు ఇన్నర్ రింగ్‌రోడ్డు లోపలతో పాటు ఐటీకారిడార్‌లో తక్కువగా ట్రాఫిక్ కన్పించేది. నేడు ఇన్నర్ రింగ్‌రోడ్డుతో పాటు కొన్నిచోట్ల అవతల కూడా ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. సికింద్రాబాద్‌లోని సంగీత్ జంక్షన్లో ఒక వాహనం సిగ్నల్ దాటాలంటే 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుందంటూ వాహనదారులు వాపోతున్నారు. సైబరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. సిటీలో దాదాపు ప్రతిచోట ట్రాఫిక్ జామ్ సమస్య ఉత్పన్నం అవుతూనే ఉంది. పటాన్చెరువు, శంషాబాద్ వంటి ప్రాంతాలలో ఔటర్ రింగ్‌రోడ్డు అవతల కూడా ఎక్కడకక్కడే ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది.
ప్రతి గల్లీలో వాహనాలు…
ప్రతి ఒక్కరు తమకు సొంత వాహనం ఉండాలని ఎదోవిధంగా వాహనం తెచ్చుకుంటున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ద్విచక్రవాహనాలు, ఆటోలు, చిన్న చిన్న కార్లతో సరిపెడుతుండంగా.. ధనవంతులు ఇంట్లో ఓక్కో వ్యక్తికి 2-3 బైక్‌లు, ఇంటి అవసరాలకు 2-3 కార్లను సమకూర్చుకుంటున్నారు. దీంతో కాలనీలు, బస్తీలలో ఎటుచూసినా వాహనాలే కన్పిస్తున్నాయి. ప్రధాన రహదారులకు ప్రత్యామ్నాయ మార్గాలుగా ఉన్న కాలనీల్లో నుంచి వాహనాలు తీసుకెళ్దామనుకునే వారికి.. గల్లీలో వాహనాల పార్కింగ్ ఇబ్బందిగా మారింది. గల్లీల్లో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపుతుండటంతో కనీసం ఆటోలు కూడా వెళ్లలేని పరిస్థితి. ప్రధాన రహదారుల్లో ఫుట్పాత్లన్నీ ఆక్రమణలకు గురవ్వడంతో పాదచారులకు నడకమార్గమే లేకుండా పోయింది. దీనికి తోడు రోడ్లపై వాహనాల నుంచి వచ్చే పొగ కారణంగా వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు తగినన్ని సంఖ్యలో పార్కులు అందుబాటులో లేని పరిస్థితి.
పట్టించుకోని పాలకులు, అధికారులు..
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోతున్నప్పటికీ అటు అధికారుల్లోగానీ, ప్రభుత్వ పెద్దల్లో గానీ ఎలాంటి చలనం లేదు. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఆర్టీసీ, విద్యుత్ తదితర విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక వసతుల కల్పిన దిశగా పనిచేయాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆయా విభాగాల మధ్య సమన్వయం కొరవడిందనే విమర్శలున్నాయి.
కోర్ సిటీలో ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు ట్రాఫిక్ పోలీసులు కన్పిస్తుంటారని, ఆ తరువాత ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేయడం, పెండింగ్ చలాన్లు వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని గ్రేటర్ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానమైన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంపై వారు శ్రద్ధ చూపడంలేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర జనాభాలో సుమారు 30 శాతం వరకు నగర జనాభా ఉందని, అలాంటిది ఇక్కడి ప్రధాన ట్రాఫిక్ సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపైనా నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.