సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : మహిళల భద్రతకు మహానగర పోలీసు శాఖ భరోసా కల్పిస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు ప్రత్యేకంగా షీ-టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. జోన్‌కు ఒకటి చొప్పున మహిళా పోలీస్స్టేషన్లు, లైంగిక దాడులు, వేధింపులు వంటి అఘాయిత్యాలకు గురైన వారికి అండగా ఉండేందుకు భరోసా కేంద్రాలను నిర్మించింది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే.. బాలికలు, యువతులు, మహిళలకు షీ-టీమ్స్ రక్షణ కల్పిస్తున్నాయి. ప్రతి ఠాణా పరిధిలో ఈ బృందాలను ఏర్పాటు చేయడంతో మహిళల భద్రతకు మరింత భరోసా కల్పించినైట్లెంది.
హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే ఒక ఐకాన్‌గా నిలిచింది. 20 అంతస్తులు, 18 అంతస్తులతో రెండు భారీ టవర్లను నగరం నడిబొడ్డున నిర్మాంచారు. ఇందులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కోటిక్ బ్యూరో(టీన్యాబ్)తో పాటు హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీసీకెమెరాలన్నింటిని ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలతో పాటు ప్రతి అంశాన్ని సీసీసీ ద్వారా పర్యవేక్షిస్తారు. ఈ టవర్లోని 7వ అంతస్తులో సీఎం కోసం ప్రత్యేక చాంబర్ నిర్మించడం మరో ప్రత్యేకత.
లైంగికదాడులు వంటి అఘాయిత్యాలకు గురైన బాధిత మహిళలు, బాలికలు, యువతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఈ భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ భరోసా కేంద్రాల్లోని పోలీసు సిబ్బంది బాధితులకు న్యాయపరమైన, వైద్యపరమైన, విద్యాపరమైన పూర్తి సహాయం అందించడమే కాకుండా వారికి సరైన ఉపాధి అవకాశాలు కూడా వారే కల్పిస్తారు. దీని వల్ల బాధిత మహిళలు లేదా యువతులు ఆత్మైస్థెర్యాన్ని కోల్పోకుండా భరోసా కల్పిస్తున్నారు.
భరోసా కేంద్రాల వల్ల లైంగిక దాడుల బాధితులకు న్యాయం జరగడమే కాకుండా నిందితులను కటకటాల్లోకి నెట్టగలుగుతున్నారు. హత్యలు వంటి నేరాలకు పాల్పడిన వారిపై రౌడీషీట్లు తెరిచినట్లుగానే లైంగికదాడులకు పాల్పడిన నిందితులపై కూడా రికార్డు షీట్లను నమోదు చేస్తున్నారు. దీని వల్ల నిందితుల కదలికలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచడంతో పాటు వారు మళ్లీ నేరాలకు పాల్పడకుండా నియంత్రంచగలుగుతున్నారు.
ఎవరైనా మహిళలు లేదా యువతులు, బాలికలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు తమ ఫోన్ నుంచి ఒక మెసేజ్ పెడితే చాలు వెంటనే కుయ్ కుయ్‌మంటూ సైరన్ మోగించుకుంటూ డ్రోన్ ఘటనా స్థలానికి చేరుకుంటుంది. అంతే కాకుండా అక్కడి ఘటనలను ఫొటోలు తీయడమే కాకుండా వీడియో రికార్డు చేస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరవేస్తుంది. రోడ్డు మార్గాన పోలీసులు వెళ్లే లోపే డ్రోన్ వెళ్లడం వల్ల జరగబోయే అఘాయిత్యాలను అడ్డుకునే వీలుంటుంది. ఈ దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. త్వరలోనే ఈ డ్రోన్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
గతంలో నగరం మొత్తానికి ఒకే ఒక్క ఉమెన్ పోలీసు స్టేషన్ ఉండగా, రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రతి జోన్‌కు ఒక ఉమెన్ పోలీసుస్టేషన్‌ను తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం పోలీసు శాఖలోని అన్ని విభాగాలలో పురుషులకు సమానంగా మహిళా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో మహానగరంలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 12 ఉమెన్ పోలీస్స్టేషన్లు, 100కు పైగా షీ-టీమ్ బృందాలు, 5 భరోసా కేంద్రాలు మహిళల భద్రత కోసం పనిచేస్తున్నాయి.
మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సిటీ సర్వేలెన్స్, సేఫ్‌సిటీ ప్రాజెక్ట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో(సీఎస్ఆర్ ఫండ్)లో భాగంగా ప్రజాప్రతినిధులు, ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి వచ్చే ఫండ్స్‌తో కమ్యూనిటీ కెమెరాలు, ప్రజల ద్వారా నేను సైతం పేరుతో ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అత్యధిక సీసీ కెమెరాలున్న మహా నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. ఫలితంగా నగరంలో జరిగే ప్రతి అంశాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీసులు పర్యవేక్షిస్తుంటారు.