Musi River | అడుగడుగునా నిరసనలు.. అడ్డగింతలు.. వాగ్వాదాలు.. చావనైనా చస్తాం.. ఇల్లు వదలం.. వివరాలు ఇవ్వం.. ఇక్కడే ఉంటాం.. అంటూ.. నినాదాలు.. విషమిచ్చి చంపి తమ ఇండ్లను కూల్చివేయాలంటూ..ఆవేదనలు.. గురువారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర్వే బృందాలకు నివాసితుల నుంచి ఎదురైన ప్రతిఘటనలివి. తమ నివాసాలను కూల్చివేయడానికి బుల్డోజర్లు రాబోతున్నాయన్న వార్తతో వారం రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా ఉన్న స్థానికులు.. బృందాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. మహిళల రోదనలు మిన్నంటాయి..సీఎం రేవంత్‌కు శాపనార్థాలు పెట్టారు. కొన్ని చోట్ల యజమానుల వివరాలు నమోదు చేసే పత్రాలను సైతం చించేశారు. ఓ యువకుడు మార్కింగ్ చేసేందుకు ఉపయోగించే ఎరుపు రంగును లాక్కొని దూరంగా విసిరేశాడు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఏకకాలంలో సర్వే చేపట్టారు. 26 బృందాలు.. మూసీ వెంట ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి ‘ఆర్బీక్స్’ మార్క్ చేశాయి. తాజా సర్వేలో రివర్ బెడ్(నది గర్భం)లో 2,116, బఫర్ జోన్లో మరో 7,850 నిర్మాణాలు ఉన్నట్లు తేల్చాయి. కాగా, ‘మీ ఇల్లు కూల్చేస్తాం. అందుకే ఈ మార్కింగ్..’ అంటూ అధికారులు స్థానికులను భయభ్రాంతులకు గురి చేయడంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బక్కపల్చని బతుకులను బజారుకీడ్చే సర్వే అంటూ మండిపడిన నిర్వాసితులు..రేవంత్ ఇంట్లో ఉంటామంటూ.. హెచ్చరించారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మూసీ సర్వేలో భాగంగా హైదరాబాద్‌లో 16, రంగారెడ్డిలో 4, మేడ్చల్‌లో 5 బృందాలు మండలాల వారీగా పర్యటించాయి. మూసీ రివర్ బెడ్ ఏరియాలో ఉన్న నిర్మాణాలను అధికారులు గుర్తించి నివేదిక సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో అంబర్‌పేట, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పుర, చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, నాంపల్లి, సైదాబాద్ మండలాలు, మేడ్చల్‌లో ఘట్కేసర్, మేడిపల్లి, ఉప్పల్, రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెంట్, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో కూల్చివేసే నిర్మాణాలను మార్క్ చేశారు. మూసీ నది వెంబడి రెవెన్యూ శాఖ నిర్వహించిన తాజా సర్వేలో రివర్ బెడ్(నది గర్భం)లో 2,116 నిర్మాణాలు, బఫర్ జోన్లో మరో 7,850 నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. హైదరాబాద్‌లో అధికారులు అంచనా వేసుకున్న 1595 నిర్మాణాల్లో నిరసనల మధ్య 941 ఇండ్లకు మాత్రమే మార్క్ చేశారు. నేడూ కూడా సర్వే కొనసాగనున్నది.
అస్తవ్యస్తంగా సర్వే..
బాధితులకు సాంత్వన కలిగించేలా అధికారుల సర్వే ఉండాలి. కానీ సీఎం రేవంత్ పాలనలో బాధితులు భయభ్రాంతులకు గురయ్యేలా ‘ మీ ఇల్లు కూల్చేస్తాం. అందుకే ఈ మార్కింగ్.’ అంటూ మూసీ ప్రాంతాల్లో సర్వే చేసిన అధికారులు స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో నిర్వాసితులు అడుగడుగునా బృందాలను అడ్డుకోవడంతో సర్వే ఇష్టానుసారంగా సాగింది. ఒక్కో బృందం 75 ఇండ్లను సందర్శించాల్సి ఉండగా, ఉద్రిక్తల మధ్య సాధ్యం కాలేదు. యజమానుల వివరాలను కూడా సరిగా సేకరించలేకపోయారు. అధికారులు అడిగిన సమాచారాన్ని ఇంటి యజమానులు భయంతో ఇవ్వలేదు. తాము ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని అధికారులతో వాగ్వాదానికి దిగిన ఘటనలు ప్రతిచోటా కనిపించాయి. ఉప్పల్‌లో కేసీఆర్ నగర్, చైతన్యపురిలో సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించినప్పటికీ ఎలాగైనా సర్వే చేయాలని ఆదేశాలు రావడంతో కొన్ని ఇండ్లుకు మార్కింగ్ చేసి మమ అనిపించారు. యజమానులు చెప్పిన సమాచారం కాకుండా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న సమాచారం మేర అధికారులే కూల్చేసే ఇండ్లను నోట్ చేసుకున్నారు.
నిరసనలు కొనసాగుతుండగానే..
ఒకవైపు స్థానికుల నిరసనలు కొనసాగుతుండగానే మూసీ పరీవాహక ప్రాంతాలోని ఇండ్లకు అధికారులు మార్కింగ్ చేశారు. అయితే సర్వే అధికారులను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు మహిళలు ఏడుస్తూ మహిళా కానిస్టేబుళ్లకు దండం పెడుతూ తమ ఇండ్ల జోలికి రావద్దంటూ వేడుకున్నారు. అయినా అధికారులు వినకపోవడంతో స్థానికులు సర్వేను అడ్డుకున్నారు. చైతన్యపురి, చాదర్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో అధికారులను నిలదీసిన ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఇంట్లో ఉంటామంటూ..నిరసన తెలిపారు.
మార్కింగ్ ఎక్కడంటే..
చాదర్‌ఘాట్, మూసానగర్, శంకర్నగర్ల్లో మూసీనది బఫర్‌జోన్‌లో ఉన్న నిర్మాణాలు, బహదూర్‌పురా, కిషన్‌బాగ్, అసద్‌బాబానగర్ తదితర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో మార్కింగ్ చేశారు. లంగర్‌హౌజ్ ఆశ్రంనగర్లో మార్కింగ్ ప్రక్రియను స్థానికులు అడ్డుకున్నారు. కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చేయడమంటే తమ బతుకులతో ఆడుకోవడమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఇంట్లో తాము మూడు, నాలుగు కుటుంబాలుగా కలిసి ఉంటున్నామని ఒక్క డబుల్ బెడ్రూం ఇండ్లలో తమ కుటుంబాలన్నీ ఎలా ఉండగలవని ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్యపురి ఫణిగిరికాలనీ, న్యూమారుతీనగర్, సత్యనగర్ల్లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు విషం ఇచ్చి తమ ఇండ్లకు మార్కింగ్ చేసి తొలగించండంటూ ఆందోళన చేశారు. ఇంటి వివరాలు, యజమానుల వివరాలు నమోదు చేసే పత్రాలను కొందరు స్థానికులు ఆగ్రహంతో చించేశారు. మార్కింగ్ చేసేందుకు ఉపయోగించే ఎరుపు రంగును ఓ యువకుడు లాక్కొని దూరంగా విసిరేశాడు.
కేసీఆర్‌నగర్ నుంచే..
మూసీ సర్వే మొదలైన నేపథ్యంలో రామంతాపూర్ దగ్గర ఉన్న కేసీఆర్ నగర్ వద్దకు అధికారులు వచ్చారు. మొత్తం 260 ఇండ్లకు మార్కింగ్ చేసే క్రమంలో తమకు పట్టాలు, పాస్‌బుక్‌లు, రిజిస్ట్రేషన్స్ అన్నీ ఉన్నా మార్కింగ్ చేయడమేమిటంటూ.. స్థానికులు అధికారులను ప్రశ్నించారు. మరోవైపు మూసీ పరీవాహక ప్రాంతాల్లో మార్కింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే కేసీఆర్ నగర్ నుంచే కూల్చివేతల పర్వం మొదలవుతుందంటూ ప్రచారం జరుగుతున్నది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2004 నుంచి ఇక్కడ ఉంటున్నామని, ‘చావనైనా చస్తాం’ కానీ ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టేది లేదంటూ నిర్వాసితులు తేల్చి చెప్పారు.
గూడు.. గోడు
ఓ మహిళను అడ్డుకుంటున్న పోలీసులు ఇప్పటికే మూసీ తీరానికి బుల్డోజర్లు..
ఇప్పటికే హైడ్రా బుల్డోజర్లు మూసీ తీరానికి చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. శనివారం సాయంత్రానికి అంతా సిద్ధం చేసి ఆదివారం కూల్చివేయడానికి హైడ్రా ప్రణాళికలు చేసుకున్నది. అందుకు తగ్గట్టుగా బందోబస్తును కూడా రెడీ చేసుకుంది. ఎలాగైనా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంటుందని ముందస్తుగానే హైడ్రా వద్ద సమాచారం ఉండటంతో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. మూసీ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఆ ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. స్థానిక నాయకులతో చర్చిస్తూ..ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నది ఒడ్డున ఉన్న నివాసాల నుంచి ఖాళీ చేసే ప్రజలకు వసతి కల్పించడానికి ప్రభుత్వం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తామని చెప్పినప్పటికీ వాటిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఖాళీ చేసే ప్రసక్తే లేదంటూ తేల్చి చెబుతున్నారు.
మిన్నంటిన రోదనలు.. రేవంత్‌కు శాపనార్థాలు
ఇప్పటివరకు ఇక్కడికి మూసీ నీళ్లే రాలే.. ఇదెట్ల ఎఫ్టీఎల్ అయితది.. లోన్లు తీసుకున్నం.. ఇంకా ఆ బాకే తీరలే.. ఇప్పుడొచ్చి ఇండ్లు కూలగొడ్తమంటే ఎట్ల… ఇది వెంకటసాయినగర్ కాలనీ వాసుల ప్రశ్న. మూసీ పరీవాహక ప్రాంతంలో సర్వే చేపట్టిన కాలనీల్లో స్థానికుల ఆవేదన ఇది. ఓట్లేసి గెలిపిస్తే తమ గూడే చెదిరేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై వెల్లువెత్తిన ప్రజాగ్రహమిది. ఎన్నో ఏండ్లుగా నివాసముంటున్న తమ ఇండ్లను కండ్లముందే కూల్చివేస్తామంటూ మార్కింగ్ చేయడానికి వచ్చిన అధికారులను నిలదీసిన మధ్యతరగతి కుటుంబాల నిరసన గళమిది. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామంటూ అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. మేము ఉన్న గృహాలను గిట్లనే ఉంచండి తప్ప.. మాకు వేరే ఇళ్లే వద్దంటూ కుండబద్దలు కొట్టిన కాలనీవాసుల కచ్చితత్వమిది.
మేము ఎలా బతకాలి..?
రూపాయి … రూపాయి కష్టపడి కట్టుకున్న ఇంటిని కూలిస్తే మేము ఎలా బతకాలి. ప్రజలకు మంచిచేస్తున్న అనుకున్న ప్రభుత్వం ఇలా ఇష్టారాజ్యంగా పేదల ఇళ్లను కూల్చేందుకు సిద్దం కావడం దారుణం. హైడ్రా పేరుతో చేస్తున్న ఆగడాలను వెంటనే ఆపాలి.
– లక్ష్మీ, అత్తాపూర్ భరత్‌నగర్.
అడవుల్లో డబుల్ బెడ్రూం ఇస్తానంటే ఎలా?
తాము కష్టపడి కట్టుకొని ఇంటికి బదులుగా ఎక్కడో అడవుల్లో డబుల్ బెడ్రూం ఇస్తామంటే సరైన పద్ధ్దతి కాదు. అధికారులు వస్తున్నారు. సర్వే పేరుతో ఇండ్లపై ఏదో రాస్తున్నారు..వెళ్తున్నారు. ఏది చేసినా చెల్లుతుందని అహంకార ధోరణితో అధికారులు వ్యవహరిస్తున్నారు.
-రాజశేఖర్, భరత్‌నగర్, అత్తాపూర్.
అన్నీ సరిగా ఉన్నా.. కూలగొడ్తమంటే ఎలా..
మేం ఇల్లు కట్టుకునేటప్పుడు అన్నీ సక్రమంగా చూసుకున్నం. సర్టిఫికెట్లన్నీ ఉన్నయ్. రిజిస్ట్రేషన్లు కూడా అయినయ్. ఈసర్వేనంబర్లో ఎలాంటి ఇబ్బంది లేదని గవర్నమెంట్ అధికారులే చెప్పారు. ఇప్పుడేమో కూలగొడ్తమని మార్కింగ్ చేస్తున్నారు. మేం ఓట్లేయకపోతే రేవంత్‌రెడ్డి గెలిచేటోడేనా. ఎప్పుడులేనిది ఇదేంది ఇప్పుడిట్ల చేస్తారు.
– చాదర్‌ఘాట్ వాసి
ఓట్లేసి తప్పుచేసినం..
పైసాపైసా కూడబెట్టి మేం ఇండ్లు కొనుక్కున్నం. మూసీ అంటున్నారు. ఎవరెవరో వస్తున్నరు. మార్కింగ్ అంటున్నరు. అసలు ఏం చేస్తరో తెలుస్తలేదు. మా ఇల్లు కూలగొడ్తమంటే మాత్రం ఊరుకోం. అధికారులను అడిగితే కొన్ని ఇండ్లు పోతయని చెబుతున్నరు. ఇదెక్కడి న్యాయం. ప్రభుత్వం మాకేం న్యాయం చేస్తున్నది. ఇళ్లు ఇస్తామని చెబుతున్నరు కానీ ఉన్న ఇల్లు కూలగొడ్తే మేం మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటం.
– చైతన్యపురి వాసి