సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): శివార్లలో ఖాళీ ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి స్వాహా చేస్తున్న ముఠాల వ్యవహారంలో సబ్‌రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది పాత్రపై మల్కాజిగిరి పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం కీసర పరిసర ప్రాంతాలలో ఏడాదిన్నర కాలంలోనే ఇలాంటివి 7 కేసుల వరకు నమోదయ్యాయి. ఈ కేసులలో ప్లాట్ యజమానికి సంబంధించిన నకిలీ పత్రాలు తయారు చేసి, అలాగే నకిలీ వ్యక్తులను కూడా ఈ ముఠాలు సృష్టిస్తూ, ఆ తర్వాత సబ్‌రిజిస్టార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ కూడా చేసిన సంఘటనలున్నాయి. ఇటీవల కొందరు 1,500 గజాల స్థలానికి సంబంధించి నకిలీ పత్రాలు తయారుచేసి తమపేరున రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నించగా కీసర పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వ్యవస్థలలోని లోపాలను ఆసరాగా చేసుకుంటూ కొన్ని ముఠాలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సిబ్బందితో కుమ్మక్కై ఇలాంటి కుట్రలు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం ఔటర్ పరిసరాలలో ఉన్న భూములకు భారీ డిమాండ్ ఉండటం, 1990కి ముందు ప్లాట్లను కొని.. ఖాళీగా ఉంచిన ప్లాట్లపైనే ఈ ముఠాలు దృష్టి పెడుతున్నట్లు సమాచారం. స్థలానికి సంబంధించి నకిలీ పేపర్లు, నకిలీ పాస్‌పోర్టులు, నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్‌కార్డులు సైతం తయారు చేస్తూ ఈ ముఠాలు ఖాళీజాగాలను కొట్టేస్తున్నాయి. విషయం అసలు యజమానులకు తెలిసేలోపే సంబంధిత స్థలాన్ని ఇతరులకు విక్రయించేస్తున్నారు. తీరా అసలు యజమానులు వచ్చి ప్లాట్‌ను చూసే వరకు ఇతరులెవరో అందులో కబ్జాలో ఉంటున్నారు. ఇదేంటిని వారు ఆరా తీయగా.. తమ వద్ద ఉన్న నకిలీ పత్రాలను చూపిస్తూ తామే యజమానులమని చెప్పుకునే పరిస్థితులు ఉంటున్నాయి. ఒకసారి నకిలీ డాక్యుమెంట్‌తో తమకు తెలిసినవారికి రిజిస్ట్రేషన్ చేసి, దాని ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో తమ నకిలీ రికార్డులను, అసలుగా మార్చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడంలో తప్పనిసరిగా సబ్‌రిజిస్టార్ కార్యాలయంలోని సిబ్బంది పాత్ర ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పాత కేసులపై కూపీ లాగుతున్న పోలీసులు..
ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కేసులలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఆయా ముఠాలకు సహకరించి ఉంటారని పోలీసులు ముందు నుంచే అనుమానిస్తున్నారు. అయితే కేవలం ఈ ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, ఆ తరువాత లోతైన దర్యాప్తు చేయడంపై మాత్రం దృష్టి సారించకపోవడంతో యథేచ్చగా ఈ ముఠాలకు సహకరించే వారు తమ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముఠాల మూలాలు, సహకరిస్తున్న వారెవరు అనే విషయాలపై లోతైన దర్యాప్తు చేయాలని మల్కాజిగిరి పోలీసులు భావిస్తున్నారు. దీంతో పాటు నకిలీ డాక్యుమెంట్లతో ఓనర్ షిప్ కోసం కోర్టులలో కేసులు వేసుకుంటున్న వారు కూడా ఉన్నారు, పోలీసు దర్యాప్తులలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుల ఆధారంగా ఆయా డాక్యుమెంట్లలో అసలు, నకిలీలు బయటపడుతాయి. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుతో పాటు పోలీసులు ఆయా కేసులలో చార్జ్జిషీట్ వేస్తుంటారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగానే అసలైన బాధితులకు కోర్టులలో ఆయా కేసులలో ఊరట లభించే అవకాశం ఉంది.
సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్నాం
నకిలీ పత్రాలతో ఖాళీ జాగాలను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్న ముఠాలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ కేసులు నమోదు చేస్తున్నాం. అయితే ఈ ముఠాలకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సహకరించే వారు ఉండే అవకాశాలుండటంతో వారిపై కూడా దృష్టి పెట్టాం. ఇప్పటివరకు నమోదైన కేసులలో మూడింట్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు వచ్చాయి. మిగతా వాటిలో రిపోర్టులు రావాల్సి ఉన్నాయి. నకిలీ ముఠాల వెనుక ఎవరెవరు ఉన్నారనే అంశాలపై లోతైన దర్యాప్తు జరుపుతాం.
– శ్రీధర్, డీసీపీ, మల్కాజిగిరి