లేఅవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల ప్రక్రియ ఇష్టారాజ్యంగా సాగుతున్నది. ఇప్పటివరకు పరిష్కరించిన వాటి కంటే తిరస్కరించిన దరఖాస్తులే అత్యధికంగా ఉన్నాయి. ప్లాట్ యజమానులను భయాందోళనలకు గురి చేసేలా ఏదో ఒక కారణం చూపి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని అధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు హైడ్రా, మరోవైపు గ్రామ పంచాయతీ లే అవుట్లు అంటూ సరికొత్త నిబంధనలు పెడుతూ పెద్దఎత్తున దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఎల్ఆర్ఎస్ ఆమోదించిన లేఅవుట్లోని ప్లాట్లకు కూడా ఈసారి ‘ఎల్ఆర్ఎస్’ను తిరస్కరిస్తున్నారు. దీనిపై ప్లాట్ యజమానులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఆదాయంపై భారీ ఆశలు పెట్టుకోగా, కనీసస్థాయిలోనూ ఆదాయం రావడంలేదని సమాచారం.
LRS | హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ సుల్తాన్పూర్ పరిధి సర్వే నంబర్ 457/1 లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 2016లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆమోదించింది. అదే సర్వే నంబర్, అదే లే అవుట్లో అప్పుడు ఎల్ఆర్ఎస్కు వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోనివారు 2020లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ అర్జీలను అధికారులు తిరస్కరిస్తున్నారు. గతంలో హెచ్ఎండీఏ అధికారులే ఈ లేవుట్‌కు ఎల్ఆర్ఎస్ను ఆమోదించారు. కానీ ఇప్పుడు దరఖాస్తు తిరస్కరించడం వెనుక మతలబు ఏమిటని ప్లాట్ యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తిరస్కరించడం ద్వారా గతంలో ఎల్ఆర్ఎస్ ఆమోదించినవారికి అనుమతులు ఉన్నట్టా…? లేనట్టా అనే అనుమానాలను యజమానులు వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా సంవత్సరాల కిందట ప్లాట్లను కొనుగోలు చేశామని, వాటికి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తిరస్కరించడాన్ని ప్రశ్నిస్తున్నారు. 15 ఏండ్ల కిందట గ్రామ పంచాయతీ చేసిన లే అవుట్లను ఇప్పుడు తిరస్కరించడాన్ని యజమానులు నిలదీస్తున్నారు.
మొత్తం 25.70 లక్షల దరఖాస్తులు
రాష్ట్రంలో మొత్తం 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీలో 1.06 లక్షలు, హెచ్ఎండీఏలో 3.58 లక్షలు, పట్టణాభివృద్ధి సంస్థలు పరిధిలో 1.35 లక్షలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 13.68 లక్షలు, పంచాయతీల్లో 6 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. ఓపెన్ ప్లాట్లు, నాన్ లేఅవుట్‌కు సంబంధించిన వాటికి దరఖాస్తుదారులు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి, తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు.దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప..ఇతర లే-అవుట్లను క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హెచ్ఎండీఏ, డీటీసీపీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విషయంలో గందరగోళాన్ని తొలగించాలని, వినతులను పట్టించుకోవాలని ప్లాట్ యజమానులు కోరుతున్నారు.