LRS | సిటీబ్యూరో: ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం మాయ ప్రపంచాన్ని తలపిస్తోంది. తమ ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు దొరికిందనీ ఆశపడిన ఎంతో మంది దరఖాస్తుదారులు ఇప్పుడు చుక్కలు చూస్తున్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతించడంతో సంతోషపడిన జనాలే ఇప్పుడు… ఆందోళన చెందుతున్నారు. కనీసం ప్రభుత్వం 25 శాతం రాయితీతో దరఖాస్తులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా.. జనాలు ఫీజులు ముందుకు రావడం లేదు. దీనికి వెబ్సైట్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలే కారణం కాగా, దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించేందుకు ముందు రావడం లేదు. ఈ మాయ ప్రపంచంలో అడుగు పెట్టడం కంటే దరఖాస్తులపై స్పందించకపోవడమే ఉత్తమమనే భావన జనాల్లో వ్యక్తమవుతున్నది.
సగానికి కంటే ఎక్కువ ఫీజులు..
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీంపై ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు, క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులు అమలు చేస్తున్న విధానాలు, ఆన్లైన్లో చూపుతున్న ప్రాసెస్ అంత గందరగోళంగా ఉంది. హెచ్ఎండీఏ పరిధిలో మూడున్నర లక్షలకు పైగా ప్లాట్లను క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 30 శాతం దరఖాస్తులు క్రమబద్ధీకరణ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తొలి దశలోనే తిరస్కరించారు. మిగిలిన 2.75 లక్షల దరఖాస్తుల్లో సగానికి కంటే ఎక్కువ ఫీజులు చెల్లించాలని నోటీషికేషన్ జారీ చేశారు. మిగిలిన వాటిలో ఇప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఎదురు చూస్తుండగా, ఫీజులు చెల్లించాలని నోటిఫికేషన్లు అందుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
ఫీజులు చెల్లించేందుకు ఇంటి నుంచే వెసులుబాటు కలిగిస్తూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినా… అందులో తలెత్తున్న టెక్నికల్ సమస్యలు దరఖాస్తుదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఫీజు పేమెంట్ మోడ్‌లోకి వెళ్లగానే ఒక్కసారిగా ప్రక్రియ నిలిచిపోవడం, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్/యూపీఐ వివరాలను నమోదు చేసిన వెంటనే ఆగిపోవడం వంటి సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులపై కొన్ని పరిమితులు ఉండటంతో… ఎల్ఆర్ఎస్ చెల్లింపుల ప్రక్రియ మాయజాలాన్ని తలపిస్తోందని, తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై తెలుసకునేందుకు హెచ్ఎండీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తున్నదని పటాన్‌చెరుకు చెందిన ఓ దరఖాస్తుదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు చెల్లిస్తే తన ఖాతా నుంచి బదిలీ కాకుండా మొరాయిస్తుందని, కానీ తన ఖాతాలో అమౌంట్ బదిలీ చేసినట్లు సమాచారం రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
తరచూ సాంకేతిక సమస్యలు..
రాష్ట్రవ్యాప్తంగా 25.4లక్షల ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇటీవల ఆ వెబ్సైట్లో కొన్ని మార్పులు చేయడంతోనే ఇబ్బందులు వస్తున్నట్లు పలువురు అధికారులు వాపోతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల మధ్య సమాచార మార్పిడి జరిగే క్రమంలో టెక్నికల్ సమస్యలు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ఇచ్చినా.. ప్రయోజనం లేదని, నిత్యం యాప్‌లో వచ్చే సమస్యలతో ప్రక్రియ సజావుగా సాగడం లేదని చెబుతున్నారు.