సిటీబ్యూరో, జనవరి 8(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో ఈనెల 10న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం కానున్నారు. ఈనెల 18న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ‘కంటి వెలుగు-2’ కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 18 నుంచి జూన్ 30వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కంటి వెలుగు-2లో ఉచిత కంటి పరీక్షలు, కండ్లద్దాల పంపిణీపై విస్తృత ప్రచారం చేయడంతోపాటు విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు జిల్లాలోని 91 వార్డుల్లో 115 క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగానూ 83 మంది వైద్యులకు, 115 మంది కంటి వైద్యులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి టీమ్‌లో ఒక డాక్టర్, కంటి వైద్యుడు, ఒక ఫార్మసిస్ట్, ఆశవర్కర్తో కలిపి 10 మంది ఉండనున్నారు.