సిటీబ్యూరో, అక్టోబర్ 29 ( నమస్తే తెలంగాణ ) : జనసేన పొత్తు బీజేపీలో అగ్గి రాజేస్తున్నది. ఉనికే లేని జనసేనతో పొత్తు అవసరం లేదని కమలం క్యాడర్ వ్యతిరేకిస్తుండగా.. అధిష్ఠానం మాత్రం పొత్తు ఉంటుందని తెగేసి చెబుతున్నది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు జనసేన పొత్తు బీజేపీలోని అగ్రనాయకుల మధ్య కూడా చిచ్చు రేపింది. మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నాయకుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి జనసేన పొత్తును వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. పొత్తులో భాగంగా గ్రేటర్లో శేరిలింగంపల్లి, కూకట్పల్లి సీట్లు తప్పకుండా తమకే ఇవ్వాలని జనసేన పట్టుబడుతున్నది. దీంతో ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్న ఆశావహులు డీలా పడిపోయారు.
ఇన్నేండ్లు పార్టీ కోసం కష్టపడితే సీట్లు వేరే పార్టీకి కేటాయించడమేంటని వారు కమలంపై విరుచుకుపడుతున్నారు. శేరిలింగంపల్లి టికెట్‌ను రవికుమార్ యాదవ్ కోరుతుండగా, కూకట్పల్లి టికెట్‌ను మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి కావాలని దరఖాస్తు చేసుకున్నారు. కానీ, వీరిద్దరనీ కాదని వేరేవారికి అప్పగించడంపై రాష్ట్ర కమలం అధిష్ఠానం యోచిస్తున్నది. దీంతో తన పార్లమెంట్ స్థానంలో ఉన్న శేరిలింగంపల్లి టికెట్‌ను రవి కుమార్‌కే ఇవ్వాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నట్టు సమాచారం. దీనిపై కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను కూడా కలిసినట్టు తెలిసింది.
కానీ, వారు మౌనం వహించడంతో ఏం చేయాలో తెలియక కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇతర పెద్దలను కలుస్తున్నారని, వారు కూడా పొత్తులో భాగంగా తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించడం కుదరదని చెప్పినట్టు సమాచారం. దీంతో కొండా నారాజయ్యాడంటూ ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో శేరిలింగంపల్లి, కూకట్పల్లి బీజేపీ నాయకులు వేర్వేరుగా సమావేశాలు పెట్టుకుని పార్టీ మారడమా.? టికెట్ దక్కించుకోవడామా.? అనే అంశాలపై పునరాలోచిస్తున్నట్టు తెలిసింది.