ఇందిరమ్మ అర్జీలకు కొర్రీలు.. సాకులు చూపుతూ భారీగా రిజెక్టు
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ప్రజల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. కానీ దరఖాస్తు చేసుకున్న కొద్దిమంది అర్హులను కుంటి సాకులు చూపుతూ తిరస్కరిస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 16 నియోజకవర్గాల్లో లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద 7,340 ఇండ్లకు దరఖాస్తులు స్వీకరించారు.
- ఇండ్లు లేనివారికు ఉన్నట్టు చూపుతున్న వైనం
- క్యాబ్ డ్రైవర్లకు కార్లున్నాయంటూ తిరస్కరణ
- ఆరు గ్యారెంటీల్లో అప్లికేషన్ పెట్టుకుంటే అనర్హులట
- హౌసింగ్ బోర్డుకు వరుస కడుతున్న బాధితులు
సిటీ బ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ప్రజల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. కానీ దరఖాస్తు చేసుకున్న కొద్దిమంది అర్హులను కుంటి సాకులు చూపుతూ తిరస్కరిస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 16 నియోజకవర్గాల్లో లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద 7,340 ఇండ్లకు దరఖాస్తులు స్వీకరించారు. పేద ప్రజలు ఇందిరమ్మ ఇల్లు కోసం రూ.6 లక్షలు చెల్లించాలనే షరతు పెట్టడంతో దరఖాస్తు చేసుకునేందుకు మొగ్గు చూపలేదు. దీంతో కేవలం 60,014 దరఖాస్తులే వచ్చాయి.
ఎంతో కొంత ఆర్థిక స్థోమత కలిగినవారు, దిగువ మధ్యతరగతికి చెందిన ప్రజలు రూ.6 లక్షలు వెచ్చించి ఇందిరమ్మ ఇంటిని కొనుగోలు చేసుకుందామని దరఖాస్తు చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరిస్తున్నది. అన్ని అర్హతలున్నా దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో హౌసింగ్ బోర్డు కార్యాలయానికి బాధితులు వరుస కడుతున్నారు. హౌసింగ్ బోర్డులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినా బాధితులకు స్పష్టమైన సమాధానాలివ్వడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో ఎన్ని తిరస్కరించారో వివరాలు అడిగినా పూర్తి వివరాలు తమ దగ్గర లేవంటూ హౌసింగ్ బోర్డు అధికారులు సమాధానమిస్తున్నారు.
వేలాదిగా దరఖాస్తుల తిరస్కరణ..
అన్ని అర్హతలున్నా దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో బాధితులు అయోమయానికి గురవుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట రూ.6 లక్షలు వసూలు చేస్తున్నా అప్పు చేసైనా దరఖాస్తు చేసుకుంటే.. తమకు ఇండ్లు ఉన్నాయని రిజెక్ట్ చేస్తున్నారని వాపోతున్నారు. ఏండ్ల తరబడిగా అద్దె ఇంట్లోనే ఉంటుంటే ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిందని షాకవుతున్నారు. ఇల్లు లేకున్నా ఉందంటూ రిజెక్టు చేశారని హౌసింగ్ బోర్డు అధికారులను ఆశ్రయిస్తే.. మీసేవలో ఫిర్యాదు చేయాలంటూ వెనక్కి పంపుతున్నట్లు బాధితులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు జీవనోపాధి కోసం ఏండ్ల తరబడిగా నగరంలో క్యాబ్ నడుపుతూ జీవనోపాధి పొందుతున్న వారికీ ఇందిరమ్మ ఇండ్లు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి.
వారికి కారు ఉందంటూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. జీవనోపాధి కోసం కారు కొనుక్కొని ట్యాక్సీ నడుపుతున్నా ఇందిరమ్మ ఇండ్లకు అర్హత లేదంటే ఎలా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. హౌసింగ్ బోర్డు అధికారులు కారును అమ్మేసి.. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకొస్తే.. ఇందిరమ్మ ఇల్లుకు అర్హత లభిస్తుందని చెబుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా అర్హులందరూ దరఖాస్తు చేసుకున్నారు. వారిని కూడా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారంటూ రిజెక్టు చేస్తున్నారు. అకారణంగా తిరస్కరణకు గురైన వాళ్లు వందలాదిగా హౌసింగ్ బోర్డుకు పరుగులు తీస్తున్నారు. అక్కడా సరైన సమాధానం రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
సొంతిల్లు లేకున్నా ఉందంటున్నారు..
బేగంపేటలోని పాటిగడ్డలో 40 ఏండ్ల నుంచి అద్దె ఇంట్లోనే ఉంటు న్నాం. నా భర్త ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మాకు నలుగురు పిల్లలు. అద్దెకు ఉంటున్న ఇంటికి మా పేరిట కరెంటు బిల్లు కూడా లేదు. అప్పు చేసైనా ఇందిరమ్మ ఇల్లు కొనుక్కుందామని దరఖాస్తు చేసుకున్నాం. కానీ, మాకు ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నదని రిజెక్ట్ చేశారు. ఇల్లు లేని మాకు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడంలేదు. హౌసింగ్ బోర్డు అధికారుల వద్దకు వెళ్లి అడిగితే మీసేవలో ఫిర్యాదు చేయాలంటున్నారు. మీసేవలో అడిగితే తమ తప్పిదమేమీ లేదని.. హౌసింగ్ బోర్డు అధికారులను అడగాలంటున్నారు. మా లాంటి పరిస్థితి చాలామందికి ఎదురవుతున్నది.
– షహేదాబేగం, పాటిగడ్డ, బేగంపేట
అక్కడ ఐప్లె చేశారని తిరస్కరించారు
20 ఏండ్లుగా కూకట్పల్లి పరిధిలోని ఎల్లమ్మ బండలో ఉంటున్నాం. జలమండలిలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నా. అక్కడ మాకు రేషన్ కార్డు కూడా ఉన్నది. మాకు పెండ్లి కాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో నా భార్య పేరిట ఆరు గ్యారెంటీల్లో భాగంగా వారి అమ్మగారి ఊరైన సూర్యాపేటలో దరఖాస్తు చేశారు. మాకు పెండ్లయ్యాక అక్కడ రేషన్ కార్డులో పేరు తొలగించి మా రేషన్ కార్డులో చేర్చాం. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేస్తే.. అక్కడ ఐప్లె చేశారంటూ రిజెక్ట్ చేశారు. హౌసింగ్ బోర్డు అధికారులను అడిగితే తామేమీ చేయలేమంటున్నారు.
-అంబేద్కర్, ఎల్లమ్మబండ, కూకట్పల్లి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

