చార్మినార్, జూలై 30 : “నువ్వెంత.. నాకేం చెప్పొద్దు.. నేనేం చేయాలో నాకు తెలుసు. ఎవరిని ఎప్పుడు డాక్టర్ దగ్గరకు పంపాలో నాకు తెలియదా? ఇక్కడ నుంచి జరిగి అటు పక్కకు నిలబడు. నీ నంబర్ వచ్చిన తర్వాత పిలుస్తా. నాకే ఎదురు చెబితే పేషంట్‌కు ట్రీట్మెంట్ మరోలా ఉంటుందంటూ చిందులేసింది.
తీరా 2 గంటల తర్వాత లోపలికి పంపించింది. తీరా డాక్టర్ వద్దకు వెళ్తే.. ఏంటయ్యా ఇంత లేటు.. కాస్త ముందుగా తీసుకొస్తే పిల్లోడు బతికేవాడు కదా? పై పెచ్చు బిడ్డపై ఎందుకింత నిర్లక్ష్యమా” అన్న మాటలతో బాధితుల బాధ వర్ణనాతీతం. రాష్ట్రంలోనే పేరున్న పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఓ ఉద్యోగి నిర్లక్ష్యంతో శిశువు నిండు ప్రాణాలు కోల్పోయింది. బాధితుల కథనం ప్రకారం.. షాబాద్ పెద్దవేడు గ్రామానికి చెందిన మాణిక్యరెడ్డి తన భార్యను ప్రసూతి కోసం ఈ నెల 28న పేట్లబుర్జ్‌లో చేర్పించాడు.
అదే రోజు సిజేరియన్ ద్వారా చిన్నారికి వైద్యులు ప్రాణం పోశారు. సంవత్సరాల తరువాత పుట్టిన బిడ్డ కావడంతో కుటుంబ సభ్యులు మురిసిపోయారు. ఈ క్రమంలో చిన్నారికి బ్రీతింగ్ సమస్య రావడంతో.. అత్యవసర చికిత్స అందించే వార్డుకు తరలించాలని వైద్యులు సూచించారు. మాణిక్యరెడ్డి చిన్నారిని తీసుకుని అత్యవసర చికిత్స అందించే వార్డుకు తీసుకెళ్లారు. అక్కడి సెక్యూరిటీ గార్డు భాగ్యలక్ష్మి మాణిక్య రెడ్డిని అడ్డుకుని “వార్డులో చాలామంది పేషంట్లు ఉన్నారు.
మీ నంబర్ వచ్చిన తరువాత నేను పిలుస్తాను. అప్పటి వరకు అక్కడే వేచి ఉండాలని” హెచ్చరించింది. డాక్టర్ చెబితేనే తీసుకొచ్చానని చిన్నారి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా రెండు గంటల పాటు అక్కడే నిలబెట్టింది. తరువాత వార్డులోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వడంతో వైద్యుల వద్దకు బాధితులు పరుగులు పెట్టారు. అప్పటికే శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
పరీక్షించిన వైద్యులు ఏంటయ్య చిన్నారులంటే ఇంత అలుసా? చివరి నిమిషంలో తీసుకువచ్చావు. ఇంకొంచెం ముందు గా వస్తే పసివాడిని బతికించే వాళ్ల్లం కదా? అనడంతో మాణిక్యరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. జరిగిన విషయాన్ని వైద్యులకు తెలియజేయడంతో పాటు సెక్యూరిటీ గార్డు భాగ్యలక్ష్మి చేసిన నిర్వాకాన్ని మంగళవారం చిన్నారి తల్లిదండ్రులు దవాఖాన సూపరింటెండెంట్ పి.రజినీ రెడ్డికి బాధితులు ఫిర్యాదు చేశారు.