గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో నీటి దందా విచ్చలవిడిగా సాగుతున్నది. వేసవి రావడంతో శివారు రోడ్లన్నీ నీటి ట్యాంకర్ల మోత మోగిపోతున్నది. ఖాళీ స్థలాల్లో ఇష్టానుసారంగా బోర్లు వేసి అక్రమార్కులు భూగర్భ జలాలను తోడేస్తున్నారు. నిత్యం వందలాది ట్యాంకర్లతో జలాలను తరలిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు తాగునీటిని అందించే హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరిసర గ్రామాల్లో వందల సంఖ్యలో బోర్లు వేసి భూగర్భ జలాలను తోడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా.. భవన నిర్మాణాలు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు వందలాది ట్యాంకర్లను విచ్చలవిడిగా తరలిస్తున్నారు. వేలాది ఫీట్ల లోతులో భూమిని గుల్ల చేసి నీటిని పీల్చేస్తున్నా.. ఈ అక్రమ దందా కోట్లలో సాగుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.
సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : నగర శివార్లలో భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడి అక్రమంగా విక్రయిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఎక్కువ సంఖ్యలో నిర్మాణాలు జరుగుతుండటంతో వేల లీటర్ల కెపాసిటీ కలిగిన వందలాది ట్యాంకర్లతో నీటిని తోడి సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారం మరో మూడు నెలలు సాగనున్నది. ఏటా ఇదే తంతు కొనసాగుతున్నా అధికారులు కండ్లకు గంతలు కట్టుకుని వేడుక చూస్తున్నారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇండ్లు, ఖాళీ స్థలాల్లో అక్రమార్కులు విచ్చలవిడిగా బోర్లు తొవ్వుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.
రాత్రి పగలు తేడా లేకుండా చిన్న తరహా ట్యాంకర్ల నుంచి జంబో ట్యాంకర్ల దాకా చక్కర్లు కొడుతున్నా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ కనీస అనుమతులు తీసుకోకుండా భూగర్భ జలాలను తోడుతున్నా.. అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. నిబంధనలు పాటించకున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వందలాదిగా అక్రమ బోర్లు వేసి.. భూగర్భ జలాలను దొంగిలిస్తున్నా తనిఖీలు చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. అధికారులు తనిఖీలు చేయకుండా బోర్ల యజమానులు మ్యానేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రూ. కోట్లలో అక్రమ నీటి దందా
మార్చి, ఏప్రిల్, మే తోపాటు జూన్ నెల దాకా ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. వర్షాలు పడేదాకా ఈ అక్రమ నీటి చోరీ దందాకు కొదవ ఉండదు. నిర్మాణంలో ఉన్న భవనాలు, వాణిజ్య సముదాయాలతో పాటు బహుళ అంతస్తుల భవనాలకు జంబో ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. దూరం, డిమాండ్‌ను బట్టి ఒక్కో ట్యాంకర్‌ను రూ.వెయ్యి నుంచి రూ.10 వేల దాకా విక్రయిస్తున్నారు. ఎండలు ముదురుతున్న కొద్దీ జంబో ట్యాంకర్‌ను రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా విక్రయిస్తారు.
బహుళ అంతస్తుల భవనాల యజమానులు, బిల్డర్లు ధర విషయంలో రాజీపడకుండా ఎంత అడిగితే అంత చెల్లిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈనెలలోనే ఉష్ణోగ్రతలు పెరగడంతో దందా జోరుగా సాగుతున్నది. రాత్రి పూట ట్యాంకర్ల రాకపోకలతో శివారు ప్రాంతాల రోడ్లు మారుమోగిపోతున్నాయి. ట్యాంకర్లపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లోగోలు పెట్టుకుని నీటిని బహిరంగంగానే తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో నీటి దందా సాగిస్తున్న అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది.
వాల్టా చట్టం తుంగలోకి..
గ్రేటర్ హైదరాబాద్‌లో వాల్టా చట్టం ఎక్కడా అమలు చేయడం లేదు. హిమాయత్‌సాగర్, కిస్మత్పూర్, గండిపేట, ఖానాపూర్, కోకాపేట, వటినాగులపల్లి, జన్వాడ, మోకిల, తెల్లాపూర్, కొల్లూరు, గోపన్‌పల్లి తండాతో పాటు పలు గ్రామాల్లో వందలాది బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. అక్రమార్కుల నీటి దందా, అధికారుల దుర్వినియోగం వల్ల వాల్టా చట్టం దుర్వినియోగం అవుతున్నది. వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్-2002 ప్రకారం ఎవరైనా తమ సొంత స్థలాల్లో బోర్లు వేయాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. సంబంధిత రెవెన్యూ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రాంతాన్ని బట్టి ఎంత లోతు బోర్ తవ్వాలో వాల్టా చట్టం ప్రకారం అధికారులు నిర్ణయిస్తారు.
ప్రభుత్వం అనుమతి లేకుండా ఇష్టానుసారం బోర్లు వేయడం శిక్షార్హమైన నేరం. దీన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తాయి. ఇష్టం వచ్చినట్లు బోర్లు వేయడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి భవిష్యత్తులో నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బోర్లు వేయకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుంది. కానీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ దందా విచ్చలవిడిగా సాగుతున్నది. వాల్టా చట్టం నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు, నగరప్రజలు కోరుతున్నారు.