హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ఇప్పుడు మొదటి దశ టేకోవర్ జంక్షన్ నిలిచిపోయింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విస్తరణ ప్రాజెక్టుల ప్రతిపాదనలు పట్టాలెక్కే దశకొచ్చాయేగానీ ఏనాడూ మొదటి దశ మెలిక తెర మీదకు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం చేసిన ఓ ప్రతిపాదనను ఆసరాగా చేసుకొని ఎల్అండ్టీ వేసిన గాలంలో కాంగ్రెస్ సర్కార్ పడిందని కొందరు నిపుణులు చెబుతుండగా, లేదు లేదు! తామే చాకచక్యంగా చవక బేరంతో మొదటి దశతో పాటు భూములను సైతం స్వాధీనం చేసుకోబోతున్నామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. ఈ నేపథ్యంలో మెట్రో మొదటి దశ టేకోవర్ సోపానంలో ఎల్అండ్టీ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఎవరిని ఎవరు మింగారనేది పక్కనబెడితే అసలు వచ్చేదెంత? పోయేదెంత? అనే లెక్కల్లో మాత్రం స్పష్టత రావడం లేదు. ఎల్అండ్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రెండు అత్యంత కీలకమైన పద్దులు ఈ టేకోవర్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటున్నారా? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ (ఏ) కింద వివిధ మార్గాల్లో 76.4 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రాజెక్టుల్ని రూ.24,269 కోట్లతో చేపట్టేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డీపీఆర్ తయారు చేసింది. దీంతో పాటు రెండో దశ (బీ) కింద పలు మార్గాల్లో మరో 86.1 కిలోమీటర్ల విస్తరణ ప్రాజెక్టును రూ.19,579 కోట్లతో చేపడతామని డీపీఆర్‌లో పొందుపరిచింది. అంటే ఇప్పుడున్న 69 కిలోమీటర్ల మొదటి దశకు అదనంగా మరో 162.5 కిలోమీటర్ల విస్తరణను రూ.43,848 కోట్లతో చేపట్టాలని అనుకుంది.
కేంద్రానికి డీపీఆర్ పంపి ఇక్కడ విస్తరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో డీపీఆర్ పరిశీలనలో భాగంగా అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండానే కేంద్రం నేరుగా ఎల్అండ్టీని సంప్రదింపుల్లోకి తీసుకుందో లేక తెర వెనక ఎలాంటి పావులు కదిలాయోగానీ విస్తరణ ప్రాజెక్టులో తాము భాగస్వాములు కాలేమని, అదే కచ్చితమైతే ఉన్న మొదటి దశ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు తాము సిద్ధమేనన్న ప్రతిపాదన హస్తిన నుంచి హైదరాబాద్‌కు వచ్చింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాకచక్యంగా చిక్కుముడిని విప్పకుండా నేరుగా మొదటి దశను టేకోవర్ చేసుకోవాలనే నిర్ణయానికొచ్చి ఎల్అండ్టీతో భేటీని ఖరారు చేసిందని అధికారిక వర్గాలే అంటున్నాయి. ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పసిగట్టిన ఎల్అండ్టీ చల్లకొచ్చి ముంతదాచకుండా రూ.13వేల కోట్ల రుణాన్ని తీసుకోవడంతో పాటు రూ.5900 కోట్లు నగదు రూపంలో ఇవ్వాలని ప్రతిపాదించగా ఆపై జరిగిన చర్చల్లో చివరకు రుణం తీసుకోవడంతో పాటు రూ.2వేల కోట్ల నగదు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని అధికారిక ప్రకటన ద్వారా వెల్లడైంది.

ప్రభుత్వ ప్రకటనకు భిన్నంగా విశ్లేషణలు…
రాష్ట్ర ప్రభుత్వం మెట్రో మొదటి టేకోవర్‌పై భిన్నమైన విశ్లేషణలు వినిపిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తాము చాకచక్యంగా రూ.25వేల విలువైన మెట్రోను తాము రూ.15వేల కోట్లకే తీసుకున్నామని చెబుతున్నారు. ఇక్కడే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో నిర్వహణలో ఏటా సుమారు రూ.600 కోట్ల లోటు ఉందనేది ఎల్అండ్టీ ఇన్నాళ్ల నిర్వహణ సారాంశం. టేకోవర్ ప్రక్రియ లేనట్లయితే ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీ 2045 వరకు అంటే మరో 19 ఏండ్ల పాటు సుమారు రూ.12వేల కోట్లు ఆ సంస్థనే ఆ లోటును భరించేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ లోటును భరించుకుంటూ నిర్వహణ చేయాలి. ప్రకారం 2045 తర్వాత ఎల్అండ్టీ ఉన్నపలంగా మొదటి దశను రాష్ర్టానికి అప్పగించి ఒట్టి చేతులతో పోవాలి. అంటే ఇప్పుడున్న రూ.13వేల కోట్ల రుణంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ టేకోవర్ ద్వారా ఆ రుణాన్ని ప్రభుత్వమే తీర్చాలి.
ఉన్న సుమారు 260 ఎకరాల భూమిని తాము ఇప్పుడే స్వాధీనం చేసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ రాయదుర్గంలోని 15 ఎకరాలు మినహా మిగిలిన భూముల్ని ఒప్పందం ప్రకారం 2045లో ప్రభుత్వానికి అప్పగించాల్సిందే. అంటే ఈ 19 సంవత్సరాల పాటు ఆ భూముల్ని లీజుకు ఇచ్చుకోవడం వల్ల వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. కానీ నిర్వహణ లోటు, రూ.13వేల కోట్ల రుణంతో పోలిస్తే ఇది చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. అనేది ప్రైవేటు కంపెనీ. అంటే నయాపైసాతో సహా లెక్కల్ని సరిచూసుకుంటుంది. సీఎం చెబుతున్నట్లుగా అగ్గువకు ప్రభుత్వానికి అమ్ముకునేందుకు ఆ సంస్థ ఎందుకు సిద్ధపడుతుంది? మెట్రో విస్తరణకు కేంద్రం అనుమతి అనే ఒక సాకును కచ్చితంగా పసిగట్టి చాకచక్యంగా బయటికొచ్చేస్తుందని ఓ రిటైర్డ్ అధికారి విశ్లేషించారు. హైదరాబాద్ మెట్రో నుంచి నిష్క్రమిస్తున్న ఎల్అండ్టీ గత సంవత్సరం ముంబై మెట్రో విస్తరణ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ (పీపీపీ) చేపట్టేందుకు ఆ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
రూ.1200 కోట్ల లెక్కలు తేలేదెలా?
మొదటి దశ టేకోవర్ అనేది ఇక అనివార్యం… ఈ నేపథ్యంలో లెక్కల్ని సరిచూసుకొని ఎల్అండ్టీకి ఇవ్వాల్సింది ఇస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమే తరువాయి. అయితే రూ.13వేల కోట్ల రుణంతో పాటు రూ.2వేల కోట్ల నగదు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కానీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టాలను అధిగమించేందుకు అప్పటి ప్రభుత్వం ఆ సంస్థకు రూ.3వేల కోట్లు వడ్డీలేని రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. అందులో రూ.900 కోట్లు ఇచ్చింది. అంటే తిరిగి ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్అండ్టీ మెట్రో నిర్వహణలో భాగంగా జీహెచ్ఎంసీ, జలమండలి, టీజీఎస్పీడీసీఎల్కు రూ. 300 కోట్ల వరకు బకాయి పడింది. వీటిని కూడా చెల్లించాల్సి ఉంది. అంటే ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి రూ.1200 కోట్లు రావాల్సి ఉంది. మరి టేకోవర్ ప్రక్రియలో వీటిని పరిగణనలోకి తీసుకుని సంస్థకు ఇచ్చే రూ.2వేల కోట్లల్లో మినహాయిస్తారా? లేదా? అనేది కీలకంగా మారింది. మినహాయిస్తే ప్రభుత్వం చెబుతున్నట్లు టేకోవర్ వ్యయం రూ.15వేల కోట్లుగా ఉంటుంది. లేకపోతే అది రూ.16,200 కోట్లుగా నమోదుకానున్నది.