సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఓవైపు తగ్గిపోతున్న ప్రయాణికుల రద్దీ, మరోవైపు తరుచు తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు మెట్రోను వెంటాడుతున్నాయి. దీనికి తోడు సర్కారు భుజాన వేసుకున్న స్వాధీన ప్రక్రియతో మెట్రో నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. దీంతో మెట్రో ప్రయాణికులు సమస్యలు తీవ్రత పెరుగుతుందే తప్ప.. సౌకర్యవంతమైన ప్రయాణం కరువైపోతుంది.
హైదరాబాద్ నగరానికి ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థగా ఎదిగిన మెట్రో రైలు.. నిర్వహణ నిర్లక్ష్యంతో సమస్యల ఊబిలో కూరుకుపోతుంది. మెరుగైన సేవలు అందించాల్సిన అధునాతన వ్యవస్థ కాస్తా.. కనీసం జనాల అవసరాలను గుర్తించలేకపోతుంది. ముఖ్యంగా పెరిగిన మెట్రో టికెట్ ధరలకు అనుగుణంగానైనా మెరుగైన సేవలు అందుతాయని ఆశించిన ప్రయాణికులకు నిరాశే ఎదురైతోంది. అదనంగా సాంకేతిక లోపాలు, సర్వీసుల్లో అంతరాయం, బ్రేక్ డౌన్ సమస్యలతోపాటు, పెరుగుతున్న ఆర్థిక భారం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తరుచుగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో మెట్రో రైలు నిలిచిపోతూనే ఉంది. ఇక పీక్ అవర్స్‌లో పరిమితికి మించి ఆక్యుపెన్సీ చేరడంతో జనాలకు నిలబడే చోటు లేకుండా పోయింది.
బ్రేక్ డౌన్‌కు పుల్‌స్టాప్ ఎప్పుడు.. ?
ఇటీవల అమీర్‌పేట్-రాయదుర్గం మార్గంలో కూడా 20 నిమిషాల అంతరాయం ఏర్పడింది. ఇలా నిర్వహణ లోపాల కారణంగా ప్రతి నెలా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు మెట్రో ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆఫీసు వేళల్లో ఏర్పడే బ్రేక్ డౌన్‌తో, బోగీల్లో ఇరుక్కుపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. నిమిషాల కొద్ది, బోగీల్లో ఉండాలంటనే భయపడిపోతున్న ప్రయాణికులు.. బ్రేక్ డౌన్ సమస్యకు పరిష్కారం చూపాలంటున్నారు. దీనికి ఎప్పుడు పుల్‌స్టాప్ పడుతుందని ప్రయాణికులు అడుగుతున్నారు. కానీ మెట్రో నిర్వహణ సంస్థ మాత్రం, లోపాలను సరిదిద్దుకోవడం కంటే, ఎంత త్వరగా ఈ ప్రాజెక్టు నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే అడుగులు వేస్తుందే తప్ప.. ఎక్కడా మెట్రో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.
తగ్గిన ప్రయాణికులు..
నిజానికి మెట్రో ప్రయాణికులను పెంచడంపై ఇప్పటివరకు మెట్రో నిర్వహణ సంస్థ దృష్టి పెట్టలేదు. ఎంతసేపు మహాలక్ష్మి పథకం ద్వారానే ప్రయాణికులు రావడం లేదని వాపోతుందే తప్ప..పెంచిన చార్జీల భారాన్ని ప్రయాణికులపై పడకుండా నిలువరించడం సర్కారు సహకారం లేకపోవడంతో ప్రయాణికుల సంఖ్య గడిచిన ఆరు నెలల్లోనే 5లక్షల నుంచి 4.5లక్షలకు చేరిందని సమాచారం. కానీ ప్రయాణికుల రద్దీపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన జారీ చేయలేదు. ఇక ప్రయాణికులకు అందించాల్సిన సేవల్లోనూ కోతలు విధిస్తున్న మెట్రో సంస్థ… సర్వీసుల సమయాన్ని 11 గంటలకు కుదించింది.
దీంతో రాత్రిపూట ఐటీ కంపెనీలు, ఇతర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు రవాణా సదుపాయాలు కరువై, ఇతర మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుతున్నారు. కనీసం పీక్ అవర్స్‌లో ఉండే రద్దీకి అనుగుణంగానైనా కోచ్‌లను అందుబాటులో ఉంచుతుందనీ ఆశించినా ప్రయోజనం లేదు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త బోగీలను ఏర్పాటు చేస్తామని ఏడాదిన్నర కాలంగా ప్రచారం చేస్తున్నారే గానీ, కనీసం ఈ అంశంలో ఎప్పటిలోగా కొత్త బోగీలను తీసుకువస్తామని చెప్పడంలో మెట్రో నిర్వహణ సంస్థ విఫలమైంది. ఇలా నిత్యం సమస్యలతో సహవాసం చేస్తూ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన దుస్థితి వచ్చిందని వాపోతున్నారు.