మణికొండ, మే 20 : కట్టుకున్న భార్యను విచక్షణా రహితంగా హత్యచేసి తాను పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం ఆనాజీపూర్ గ్రామానికి చెందిన అచ్చెర్ల నాగరాజు(37) వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఎనిమిదేళ్ల క్రితం అదే జిల్లా చివ్వేముల మండలం కాశింపేట గ్రామానికి చెందిన సుధారాణితో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లుగా సొంతూరులో మితిమీరిన అప్పులు చేసి ఉన్న భూమిని అమ్ముకుని అప్పులు తీర్చి శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో అద్దె ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటూ మేఘనగడ్డ ప్రాంతంలో క్లినిక్ నడుపుతున్నాడు.
నాగరాజు ఇక్కడ కూడా పలువురి వద్ద అప్పులు చేసి నిత్యం మద్యం సేవిస్తున్నాడు. ఇదే విషయంపై భార్య సుధారాణి(34) పలుమార్లు భర్తతో గొడవపడేది. అయితే శుక్రవారం రాత్రి మద్యం సేవించిన నాగరాజు కొబ్బరిబోండాలు నరికే కత్తితో ఇంటికి వచ్చి సుధారాణితో గొడవ పడ్డాడు. దీంతో పెద్ద కుమారుడు దీక్షిత్(7) తమ్ముడు అక్షిత్(5)ను తీసుకొని నిత్యం జరిగే గొడవలే అని పక్కింట్లోకి వెళ్లిపోయాడు. ఇద్దరి గొడవలో సుధారాణి మెడపై కత్తితో నరికి హత్యచేసిన నాగరాజు తాను మోనోక్రొటోపాస్ మందును సేవించి తనువుచాలించాడు. తెల్లారిన తర్వాత పిల్లలిద్దరూ ఇంట్లోకి రాగానే వంటగదిలో సుధారాణి, హాల్లో నాగరాజు విగతజీవులుగా పడి ఉన్నారు. విషయాన్ని చిన్నారులు చుట్టుపక్కల వారికి తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ కొడుకు బతికున్నప్పుడు తమను పట్టించుకోలేదని, పిల్లల్ని దిక్కులేనివారిని చేశాడని నాగరాజు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లితండ్రులిద్దరూ మృతి చెందడంతో చిన్నారులు కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుబుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు.